Pawan Kalyan : ఏపీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సంచలన విజయాలను నమోదు చేశారు. పోటీ చేసిన అన్ని స్థానాల్లో భారీ మెజార్టీతో గెలిచారు. దీంతో మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వై ప్లస్ సెక్యూరిటీ కల్పించారు. ఎస్మార్ట్ వాహనంతో పాటుగా బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించారు. నేడు వెలగపూడి సచివాలయానికి పవన్ కళ్యాణ్ విచ్చేశారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి సచివాలయానికి వస్తుండటంతో ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు అమరావతి రైతులు ఏర్పాట్లు చేశారు. సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి వెలగపూడి సచివాలయం వరకు మానవహారంతో స్వాగతం పలికేందుకు అమరావతి రైతులు సిద్ధమయ్యారు. అమరావతిలోని సచివాలయంలో రెండో బ్లాక్ లో తనకు కేటాయించిన ఛాంబర్ ను పరిశీలించి మర్యాదపూర్వకంగా సీఎం చంద్రబాబును కలుస్తారు. రేపు పవన్ పూర్తి స్థాయి బాధ్యతలు స్వీకరిస్తారు.
విజయవాడలోని సూర్యారావుపేటలో ఉన్న జలవనరుల శాఖకు చెందిన అతిథి గృహాన్ని ప్రభుత్వం పవన్ కళ్యాన్ కు కేటాయించింది. 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో దీన్ని అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వైసీపీ హయాంలో బొత్స సత్యనారాయణ ఈ భవనాన్ని ఉపయోగించారు. గత ప్రభుత్వ హయాంలో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పేషీలు ఐదో బ్లాక్ లో ఉండేవి. ఇప్పుడు వీటిని రెండో బ్లాక్ కు మార్చేశారు. పవన్ తో పాటు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్‌కు రెండో బ్లాక్ మొదటి అంతస్తులో ఛాంబర్లను కేటాయించారు. ఈ బ్లాక్ లో గ్రౌండ్‌ఫ్లోర్‌లోని పేషీని ఇప్పటికే పురపాలకశాఖ మంత్రి నారాయణకు అప్పగించారు. సీఎం పేషీ ఒకటో బ్లాక్ దగ్గర ఉంది. పవన్ పేషీ రెండోబ్లాక్‌లో ఉంటే అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం భావించింది.