Pawan Kalyan : నేటి రాజకీయాలు మొత్తం డబ్బు చుట్టే తిరుగుతున్నాయి. గాంధీ, చంద్రబోస్ లాంటి మహనీయులు ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలవలేని పరిస్థితి. డబ్బు ఉన్నవాడికే రాజకీయం. సామాన్యులు జెండాలు మోయడం వరకే పరిమితం. సంపన్నులకు మాత్రమే ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు. ఆ పదవులకు సగటు కార్యకర్తలకు అవకాశమే లేదు. ఇలాంటి పరిస్థితిని మార్చాలని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ కు జనసేన స్థాపించారు.
2019 ఎన్నికల్లో సామాన్యులకు టికెట్లు ఇచ్చారు. రూపాయి ఖర్చు పెట్టకపోవడంతో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఇక ప్రస్తుత 2024 ఎన్నికల్లో మునపటి పరిస్థితి ఎదురుకావొద్దని పవన్ డిసైడ్ అయ్యారు. అందుకే పార్టీ జెండాలు మోసిన వారికి కనీసం భోజనాలైనా పెట్టాలని ఆదేశించారు. దీనికి పార్టీ నేతలు, నాయకులు సహకరించాలని కోరారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఆ పార్టీ అవసరాల కోసం రూ.10 కోట్ల విరాళాన్ని అందించారు. మంగళవారం ఆయన పార్టీ కార్యదర్శి నాగబాబు సమక్షంలో కోశాధికారి ఏవీ రత్నానికి చెక్కు అందించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు. స్వతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడిపించడానికి మోతీలాల్ నెహ్రూ వంటి నాయకులు తమ స్వార్జితాన్ని ఉద్యమానికి విరాళంగా ఇచ్చేవారు.
ఆ రోజుల్లో తమ సొంత డబ్బును వెచ్చించిన తీరు గొప్పది. ఓ సదాశయం కోసం రాష్ట్ర భవిష్యత్ ను సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జనసేన సాగిస్తున్న ప్రయాణానికి నా వంతుగా రూ.10 కోట్లను అందిస్తున్నాను. ఇది పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. సగటు కూలీ తన సంపాదనలో రోజూ రూ.100 విరాళం ఇచ్చి పార్టీ ఎదుగుదలకు తోడ్పడుతున్నారు. ఓ మేస్త్రీ రూ.లక్ష విరాళం ఇచ్చారు. మరికొందరు తమ పింఛన్ లో కొంత భాగం పంపుతున్నారు. అలాంటి వారి స్ఫూర్తితో సినిమాల ద్వారా వచ్చిన నా కష్టార్జితాన్ని పార్టీ కోసం అందించడం చాలా సంతోషం గా ఉంది.’’ అని పేర్కొన్నారు.