JAISW News Telugu

Pawan Kalyan Campaign : 30 నుంచి పవన్ కళ్యాణ్ ప్రచారం.. అక్కడి నుంచే ప్రారంభించనున్న జనసేన అధినేత..

Pawan Kalyan Campaign

Pawan Kalyan Campaign

Pawan Kalyan Campaign : ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు మే 13వ తేదీన జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే కుప్పం నుంచి ప్రచారాన్ని ప్రారంభించగా.. ఇప్పుడు దాని మిత్రపక్షం జనసేన కూడా ప్రారంభించడానికి సిద్ధమైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచారానికి డేట్ ఫిక్స్ చేశారు.

మార్చి 30వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని జనసేన పార్టీ ప్రకటించింది. పవన్ కళ్యాణ్ తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ రోజు (మార్చి 25) జనసేన కీలక నేతలతో సమావేశమైన పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచారాన్ని మూడు దశల్లో నిర్వహించాలని షెడ్యూల్ పెట్టుకున్నారు. జనసేన పోటీ చేస్తున్న నియోజకవర్గాల పర్యటనలను షెడ్యూల్ చేయాలని తన పార్టీ నేతలను ఆదేశించాడు. పొత్తు కారణంగా ఈ ఎన్నికల్లో జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీకి పరిమితమైన సంగతి తెలిసిందే.

పిఠాపురం పర్యటనలో భాగంగా తొలి రోజున ప్రముఖ పవర్ స్పాట్ పురుహూతికా దేవి ఆలయంలో పవన్ కళ్యాణ్ ఆశీస్సులు పొంది తన ‘వారాహి’కి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం ఆయన దత్త పీఠాన్ని సందర్శించనున్నారు.

తొలుత పిఠాపురం నియోజకవర్గంలో మూడు రోజుల పాటు పార్టీ సమావేశాలు నిర్వహించనున్నారు. కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, బీజేపీ నేతలతోనూ పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. అతని పిఠాపురం పర్యటన షెడ్యూల్‌లో బంగారు పాపా దర్గా సందర్శనలు, క్రైస్తవ నాయకులతో సమావేశాలు మరియు సర్వమత ప్రార్థనలు ఉన్నాయి.

అంతేకాదు ఈ ఏడాది ఉగాది పండుగను పిఠాపురంలోనే ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్.

Exit mobile version