Pawan Kalyan : సినిమాలకు పవన్ బై.. బై..!
Pawan Kalyan : జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పార్టీ పెట్టిన పదేళ్ల తర్వాత ఆయన మొదటి విజయం నమోదు చేసుకున్నారు. 2014, మార్చి 14న పార్టీ పెట్టిన ఆయన ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో బీజేపీ, టీడీపీకి మద్దతిచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో రెండు చోట్ల ఒంటరిగా పోటీ చేసి ఓటమిని చవిచూశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలతో కలిసి మహా కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన అన్ని విజయం సాధించి ప్రభంజనం సృష్టించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో పవన్ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు కీలక పదవులు అప్పగించారు. పంచాయితీ, రూరల్ డెవలప్‌మెంట్, రూరల్ వాటర్ సప్లయ్, అటవీ, పర్యావరణ శాఖలను అప్పగిస్తూ చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. మొదట హోం ఇస్తానన్న ఆయన సున్నతంగా తోసి పుచ్చారు. ఆయన కావాలనే ఈ శాఖలను తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సినిమాల్లో నటిస్తారా? లేదా? అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నం అవుతోంది.
పవన్ కళ్యాణ్ కేవలం ఎమ్మెల్యే అయితే సినిమాల్లో నటించినా ఎవరూ పట్టించుకునే వారు కాదు. కానీ ఇప్పుడు డిప్యూటీ హోదాలో ఉన్నారు. ఇంకా ఆయన వద్ద కీలకమైన శాఖలు కూడా ఉన్నాయి. దీంతో ఆయన సినిమాల్లో నటిస్తే తీవ్ర విమర్శలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. దీనికి తోడు కీలక శాఖలు కాబట్టి వాటి పర్యవేక్షణ, తదితరాలను చూసుకోవాలి కాబట్టి టైం కూడా మిగలదు. కాబట్టి సినిమాల ఎంపిక, డేట్లు, ఇటు శాఖలను ఎలా సమన్వయం చేసుకుంటారో వేచి చూడాలి మరి.