Pithapuram Success Meet : సాధారణంగా ఒక సినిమా సక్సెస్ అయితే ఆ మూవీకి పనిచేసిన టీం సక్సెస్ మీట్ ఏర్పాటు చేయడం సర్వ సాధారణం. సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందుకు కారణమైన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పుకుంటుంది చిత్రబృందం. ప్రస్తుతం రాజకీయాలలో కూడా ఇదే ట్రెండ్ నడుస్తుంది. అయితే ఫలితాలకు ముందే కొందరు ఓటర్లకు కృతజ్ఞత తెలియచేస్తున్నారు. మరికొందరు పోలైన ఓటింగ్ శాతానికి అభినందనలు చెప్పుకుంటున్నారు.
అయితే ఏపీ ఎన్నికలలో అందరి దృష్టి కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం పైనే ఉంది. అది జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న ప్రాంతం కావడం.. పిఠాపురం ఈ ఎన్నికలలో హాట్ సీట్ గా మారింది. గత ఎన్నికలలో పోటీ చేసిన రెండు స్థానాలలో పవన్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఐదేళ్లు ఆ అవమాన భారాన్ని మోస్తూ, వైసీపీ నేతల చీత్కారాలను భరిస్తూ వచ్చాడు. ఈ సారి కొట్టించుకోవడం కాదు మనమే కొట్టాలన్న పట్టుదలతో పనిచేసింది జనసేన.
జూన్ 4 ఎన్నికల ఫలితాల తరువాత జరగబోవు అసెంబ్లీ సమావేశాలలో పవన్ గొంతు వినిపించడానికి, ‘పవన్ అనే నేను’.. అంటూ ప్రతిజ్న వినేందుకు యావత్తు రాష్ట్ర ప్రజానీకం, జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఒక పార్టీ అధినేతగా కూటమి తరుపున ప్రచార బాధ్యతలు స్వీకరించాల్సిన పవన్ తానూ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోయారు.
దీంతో జనసేన తరుపున పవన్ గెలుపు కోసం అక్కడి టీడీపీ ఇంచార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ తో పాటుగా వెండి తెర, బుల్లి తెర నుంచి నటీనటులు స్వచ్ఛందంగా తరలి వచ్చి ఎన్నికల ప్రచార బాధ్యతలను చేపట్టారు. ఇప్పటికే పిఠాపురంలో పవన్ గెలుపు దాదాపుగా ఖాయంగా తేలిపోయింది. కేవలం మెజారిటీ మీదే అందరి దృష్టి. అటు అధికారంలో ఉన్న వైసీపీ కూడా పిఠాపురం పై పూర్తిగా ఆశలు వదులుకుంది. ‘వార్ వన్ సైడ్’ అంటూ ఇప్పటికే టీడీపీ నేత వర్మ మీడియా ముఖంగా పవన్ గెలుపుని నిర్ధారించేశారు.