Pawan Kalyan : పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలిచిన పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎంగా నియమితులయ్యారు. పైగా తనకు ఇష్టమైన శాఖ పంచాయతీరాజ్ కు మంత్రిగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో మరో మూడు నెలల పాటు ఆంధ్రప్రదేశ్ లోని వివిధ నియోజకవర్గాల్లో పాలన, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెడతానని, తర్వాత గానీ సెట్స్ పైకి వచ్చే సూచనలు లేవని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ ప్రకటన తన నిర్మాతలకు ఉపశమనం కలిగిస్తుందా? వారిని ఆందోళనకు గురిచేస్తుందా?
డీవీవీ దానయ్య ‘#OG’ నిర్మించారు. ఇందులో పవన్ కళ్యాణ్ నటించారు. ఈ పెద్ద సినిమా రిలీజ్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్టులో భారీ పెట్టుబడి పెట్టింది, ఇంకా లేట్ అయితే నిర్మాణ సంస్థ నష్టపోయే ప్రమాదం ఉంది. ‘హరి హర వీరమల్లు’ను నిర్మిస్తున్న ఏఎం రత్నం, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను తీసుకొస్తున్న మైత్రీ మూవీస్ కు కూడా ఇది చేదు వార్తనే. పవన్ తమకు వీలైనంత త్వరగా సమయం ఇవ్వాలని ఈ సినిమాల నిర్మాతలంతా కోరుకుంటున్నారు. లేదంటే పెరిగిన వడ్డీలతో ఈ నిర్మాతలకు లాభాల కంటే నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం నిర్మాతలందరూ పవన్ డేట్స్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధిక టికెట్ ధరలకు అనుమతిస్తుందని, వీటిద్వారా తమ మొత్తం పెట్టుబడి త్వరగా రికవరీ అవుతుందని వారు ఆశాభావంతో ఉన్నారు.
ఏపీ ఎన్నికల ఫలితాలపై పవన్ కళ్యాణ్ నిర్మాతలు హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వారు అక్కడి అధికార పార్టీలతో ప్రత్యక్షంగా/ పరోక్షంగా సంబంధం కలిగి ఉన్నారు. అయితే పవన్ త్వరగా డేట్స్ ఇవ్వాలని వారు కోరుతున్నారు.