Pawan Effect : మరో రెండు నెలల్లో ఎన్నికలు రాబోతుండగా ఏపీలో కొత్త ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. ఎవరి వ్యూహాలతో వారు ముందుకెళ్తున్నారు. నిన్న జనసేనాని పవన్ కల్యాణ్ టీడీపీ పొత్తు ధర్మం పాటించడం లేదంటూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పొత్తు వేళ ఏకపక్షంగా సీట్ల ప్రకటన ఎలా చేస్తారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తానూ రెండు సీట్లను ప్రకటించేశారు. లోకేశ్ సీఎం సీటు షేరింగ్ పై చేసిన వ్యాఖ్యలపైనా స్పందించారు. పొత్తు కోసమే ఇవన్నీ తాను భరిస్తున్నానని చెప్పుకొచ్చారు. అయితే పొత్తు ధర్మంపై పవన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తున్నది.
మిత్రపక్షంగా ఉంటూ టీడీపీ సీట్లు ప్రకటించడాన్ని పవన్ తప్పుబట్టారు. పొత్తు ధర్మం గురించి ప్రశ్నించారు. తాము సింగిల్ గా పోటీ చేస్తే సీట్లు వస్తాయి కానీ అధికారం రాదని పేర్కొన్నారు. అందుకే పొత్తు పెట్టుకున్నామని చెప్పుకొచ్చారు. అయితే చంద్రబాబు రెండు సీట్లను ప్రకటించడంతో తప్పని పరిస్థితుల్లో తానూ ఓ రెండు సీట్లను రాజోలు, రాజానగరంలను ప్రకటిస్తున్నానన్నారు.
అయితే పవన్ చేసిన ప్రకటనతో టీడీపీ, జనసేనల్లో రచ్చ మొదలైంది. సీట్ల పంచాయితీలు రచ్చకెక్కాయి. పవన్ ప్రకటన చేసిన రెండు నియోజకవర్గాలైన రాజోలు, రాజానగరాలకు చెందిన టీడీపీ నేతలు, సీట్లు ఆశిస్తున్న నేతలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడితో సమావేశమయ్యారు. రాజోలు సీటు జనసేనకు ఇవ్వడంపైన ఆందోళనకు దిగారు.
రాజోలు నుంచి సీనియర్ నేత గొల్లపల్లి సూర్యారావు, రాజానగరం నుంచి బొడ్డు వెంకటరమణ చౌదరి సీట్లు ఆశిస్తున్నారు. తాజాగా పవన్ వ్యాఖ్యలతో వారు భగ్గుమంటున్నారు. పార్టీలో ఎలాంటి చర్చ లేకుండా, కనీసం తమను సంప్రదించకుండా ఇలా ప్రకటన చేయడమేంటని ప్రశ్నించారు. చంద్రబాబు జిల్లాల పర్యటనలో ఉండడంతో అచ్చెన్నాయుడితో తమ మొరను వినిపించారు. దీంతో అచ్చెన్న వారిని సముదాయించారు. పొత్తులో భాగంగా జనసేన ఆ సీట్లను ప్రకటించిందని.. చంద్రబాబు అన్ని విషయాలు మాట్లాడుతారని.. ఎవరూ ఆందోళన చెందవద్దని బుజ్జగించారు. కానీ గొల్లపల్లి అనుచరులు తమకు న్యాయం చేయాలని నినదించారు.
కాగా, ఇదే తరహాలో పిఠాపురంలోనూ టీడీపీ-జనసేన నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది. మాజీ ఎమ్మెల్యే వర్మ పిఠాపురం నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. స్థానిక సామాజిక సమీకరణాలతో జనసేన ఇక్కడ సీటుపై ఆశలు పెట్టుకుంది. పవన్ కల్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో వర్మ పార్టీ ముఖ్యులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటికి జనసేన నేతలను ఆహ్వానించడం లేదు. వర్మ ఏర్పాటు చేసిన ఓ సభలో అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ..పిలువగానే అందుబాటులో ఉండే వర్మ లాంటి నేతలు అవసరమని వ్యాఖ్యానించారు.
ఇలా టీడీపీ, జనసేన వర్గాల్లో పవన్ చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. ఎవరెవరు ఎక్కడ పోటీచేయాలనే విషయాన్ని తేల్చకపోవడంతోనే ఈ రచ్చ జరుగుతోందని తెలుస్తోంది. బీజేపీ విషయంలో క్లారిటీ రాగానే టీడీపీ, జనసేన అధినేతలు సీట్ల పంపకాలు మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి.