Pawan Kalyan : ఏపీలో ఎన్నికల షెడ్యూల్ మరో మూడు, నాలుగు రోజుల్లో రానుంది. పార్టీలు అభ్యర్థుల ప్రకటనను వేగవంతం చేశాయి. ఇక టీడీపీ కూటమి సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కి వచ్చింది. జనసేనకు 24 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలు ఖరారు చేశారు. అందులో 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు పవన్ తన అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన 19 స్థానాల్లో ఒక స్థానంపై తాజాగా పవన్ క్లారిటీ ఇస్తూ తమ అభ్యర్థిని ప్రకటించారు.
జనసేన పోటీ చేసే స్థానాల్లో ఇప్పటికే నెల్లిమర్ల, రాజానగరం, తెనాలి, కాకినాడ రూరల్, అనకాపల్లి స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించారు. రాజమండ్రి రూరల్ స్థానం కూడా జనసేనకు వెళ్తుందని ప్రచారం జరిగింది. దీంతో అక్కడ టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీలోని బుచ్చయ్య లాంటి సీనియర్ కు సీటు లేకపోతే ప్రతికూల సంకేతాలు వెళ్తాయని భావించారు. ఫలితంగా రాజమండ్రి రూరల్ నుంచి సీటు ఆశించిన కందుల దుర్గేశ్ కు ఇప్పుడు నిడదవోలు సీటు ఖరారు చేస్తూ పవన్ నిర్ణయం తీసుకున్నారు. కొద్ది రోజుల కిందట దుర్గేశ్ కు రాజమండ్రి సీటు కోసం ఆయన అనుచర వర్గం ఆందోళనకు దిగింది. దీంతో దుర్గేశ్ ను నిడదవోలు నుంచి పోటీ చేయాలని పవన్ సూచించారు.
పవన్ సూచన మేరకు దుర్గేశ్ పోటీకి ఒప్పుకున్నారు. ఇదే సమయంలో టీడీపీ నుంచి గతంలో ఇక్కడ రెండు సార్లు వరుసగా గెలిచిన బూరుగుపల్లి శేషారావు సీటు పైన ఆశలు పెట్టుకున్నారు. తాజాగా ఆయన అనుచరవర్గం నిడదవోలు నుంచి టీడీపీ రాష్ట్ర కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. శేషారావుకు సీటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు బీజేపీ, జనసేన నేతలు టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. పొత్తులో భాగంగా జనసేన-బీజేపీకి 8 ఎంపీ, 30 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. జనసేన తాజా ప్రకటనతో ఆరు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మిగిలిన ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలపైన ఈ చర్చల్లో క్లారిటీ రానుంది.