Pawan Alliance : ‘బలవంతపు’ పొత్తుకు పవన్ ప్రయత్నం.. ఢిల్లీ పెద్దలు ఏదో ఒకటి తేల్చేయండి..
Pawan Alliance : ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార వైసీపీ ఇవాళ భీమిలి సభతో ఎన్నికల సమరానికి ‘సిద్ధ’మైంది. ఇక కాంగ్రెస్ పార్టీ స్టేట్ చీఫ్ వైఎస్ షర్మిల కూడా రాష్ట్ర పర్యటనలకు రెడీ అయ్యారు. ఇక టీడీపీ, జనసేనల మధ్య పొత్తు కుంపట్లు రగులుతున్నాయి. పొత్తు ధర్మంపై నిన్న పవన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ఈ తరుణంలో టీడీపీ, జనసేన కూటమిలోకి బీజేపీని తీసుకురావడానికి పవన్ కల్యాణ్ ఆ పార్టీ పెద్దలతో మాట్లాడడానికి ఢిల్లీ వెళ్లారు.
ఈవిషయంలో పవన్ కల్యాణ్ అనవసరంగా యాగి చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. టీడీపీతో పొత్తుకు బీజేపీ పెద్దలకు ఇష్టం లేనట్టు తెలుస్తోంది. కేంద్రంలో తమకు అధికారంలోకి రావడానికి టీడీపీ అవసరం పెద్దగా లేదన్న కారణంతో పాటు గతంలో చంద్రబాబు తమతో విభేదించిన తీరుతో వారు పొత్తుకు అంతగా ప్రాధాన్యమివ్వడం లేదు. ఇక చంద్రబాబు కూడా రాష్ట్రంలో బీజేపీతో పొత్తు లేకున్నా పెద్దగా ఇబ్బంది లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. బీజేపీకి వచ్చే రెండు, మూడు శాతం ఓట్లతో తమకు పెద్దగా ఒరిగేదేం లేదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చంద్రబాబు బీజేపీపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపడం లేదని అంటున్నారు.
అయితే పవన్ మాత్రం కూటమిలోకి బీజేపీ రావాలని బాగా ప్రయత్నిస్తున్నారు. పవన్ పొత్తు పేరుతో బీజేపీని రాష్ట్ర స్థాయిలో ఎదగనివ్వడం లేదని ఆ పార్టీ క్యాడర్ ఆరోపిస్తుంది. బీజేపీ, జనసేన పొత్తు పేరుకు మాత్రమేనని, కనీసం ఆయన ఒక్కసారి కూడా బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొన లేదంటున్నారు. కనీసం ఒంటరిగానైనా రాష్ట్రంలో పోటీ చేసి ఐదో, ఆరో సీట్లైనా గెలుస్తామంటే పవన్ పొత్తు పేరిట తమను కట్టడి చేస్తున్నట్లు వాపోతున్నారు. ఈ వ్యవహారంలో రాష్ట్రంలో బీజేపీకే ఎక్కువ నష్టం జరుగుతోందని అంటున్నారు.
ఢిల్లీ టూర్ వెళ్లినా పవన్ కల్యాణ్ కు బీజేపీ హైకమాండ్ ఏదో ఒకటి తేల్చాలని శ్రేణులు కోరుకుంటున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పార్టీ సమాయత్తం కావాల్సిన అవసరముందని అంటున్నారు. పొత్తు పెట్టుకుంటారా..లేదా? అనేది ఏదో ఒకటి తేల్చితే.. దాని ప్రకారం ఎన్నికలకు సిద్ధం అవుతామని చెబుతున్నారు. అంతే తప్ప జనసేన ప్రయోజనాల కోసం బీజేపీని వాడుకోవడం తగదని వారు హితువు పలుకుతున్నారు.