Parliament:లోక్‌సభలో అలజడి వెనుక మాస్టర్ మైండ్ అతడే!
Parliament:పార్లమెంట్‌లో బుధవారం అకస్మాత్తుగా చొరబడి ఇద్దరు దుండగులు సృష్టించిన అలజడి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రజాస్వామ్య దేవాలయంగా పిలిచే పార్లమెంట్‌లో ఊహించని పరిణామాలు చోటు చేసుకోవడం దేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడి సమయంలో ఇద్దరు దుండగులని పట్టుకున్న పోలీసులకు విచారణలో కీలక విషయాలు బయటికి వస్తున్నాయి.
లోక్ సభలో పట్టుబడిన మనోరంజన్ అనే వ్యక్తే ఈ ఘటన మొత్తానికి మాస్టర్ మైండ్ అని పోలీసు వర్గాలు గురువారం వెల్లడించాయి. మనోరంజన్, సాగర్ శర్మ, నీలం, అమోల్ శిందె, విశాల్, లలిత్ అనే ఆరుగురు దుండగులు తాజా ఘటనకు పాల్పడిన విషయం తెలిసిందే. ఇందులో మనోరంజన్, సాగర్ శర్మ లోక్‌సభలోకి చొరబడగా, నీలమ్, అమోల్ శిందే భవనం వెలుపల గందరగోళం సృష్టించారు. ఈ నలుగురితో పాటు వీరికి సహకరించిన విశాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా లలిత్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
తాజా ఘటన మొత్తానికి మాస్టర్ మైండ్ మనోరంజనే నని పోలీసు వర్గాలు తాజాగా వెల్లడించాయి. కర్ణాటకలోని మైసూరుకు చెందిన మనోరంజన్ ఒక ఎంపీ నుంచి పార్లమెంట్‌లోకి ప్రవేశించడానికి పాస్ తీసుకున్నాడు. సాగర్ శర్మను తన స్నేహితుడిగా పేర్కొంటూ అతడికి పాస్ ఇప్పించాడు. అతని పిలుపుతోనే మితగావారు కూడా ఈ ఆందోళనలో పాల్గొనట్టు పోలీసులు గుర్తించినట్లు సమచారం. ఈ ఏడాది జరిగిన బడ్జెట్ సమావేశాల సమయంలోనే మనోరంజన్ పార్లమెంట్ వద్ద రెక్కీ నిర్వహించినట్టు పోలీసులు పేర్కొన్నారు. మనోరంజన్ తీరు నక్సల్స్ భావజాలంతో పోలి ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.