Parliament Elections : తెలంగాణలో 17 ఎంపీ స్థానాల్లో మే 13న పోలింగ్ జరగనుండగా.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో రెండు పార్టీలకు లోక్ సభ ఎన్నికలు కీలకంగా మారాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండి తన భుజాలపై భారం వేసుకుని పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చారు.
ప్రస్తుతం జరగబోయే పార్లమెంటు ఎలక్షన్ లో కాంగ్రెస్ 10 నుంచి 12 స్థానాల్లో విజయం సాధించాలని కోరుకుంటోంది. అయితే అది అంతా ఈజీ కాదని సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ కు 7, బీజేపీకి అయిదు నుంచి ఆరు, మజ్లిస్ 1, బీఆర్ఎస్ రెండు లేదా మూడు స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని సర్వే లు చెబుతున్నాయి.
ఒక ఎంపీ స్థానం గెలుచుకుంటే దాదాపు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచినట్లే. అక్కడ ఏడు నియోజకవర్గాల్లో పట్టు సాధించినట్లు లెక్క. అయితే గతంలో మూడు ఎంపీ స్థానాలు ఉన్న కాంగ్రెస్ ఈ సారి 12 గెలుచుకోవాలని భావిస్తుండగా.. బీజేపీ గట్టి పోటీ ఇస్తుంది. బీఆర్ఎస్ గతంలో 9 స్థానాల్లో విజయం సాధించగా.. ప్రస్తుతం రెండు లేదా మూడు చోట్ల గెలిచేందుకు శ్రమించాల్సిన పరిస్థితి. ఈ ఎన్నికల్లో మాజీ సీఎం కేసీఆర్ గారడీ పనిచేయకపోతే రాబోయే రోజుల్లో ఆ పార్టీకి మరింత తిప్పలు తప్పవు
బీజేపీ కూడా ఈ పార్లమెంటు ఎలక్షన్ లో కనీసం అయిదు నుంచి ఆరు సీట్లు గెలుచుకునేలా ఉందని సర్వేలు తెలుపుతున్నాయి. దేశంలో బీజేపీ హవా వీస్తున్నందు వల్ల ఇక్కడ కూడా దాని ప్రభావం ఉంటుందని అందరు అనుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల కంటే సగం సీట్లు కూడా గెలిచేలా కనిపించడం లేదని సర్వేలు చెబుతున్నాయి. మరి ఈ సమయంలో కేసీఆర్ ఏదైనా మ్యాజిక్ చేసి ఎక్కువ సీట్లలో గెలిపిస్తాడా.. లేదా చూడాలి. పార్టీ నుంచి వెళ్లిపోతున్న వారిని కాపాడుకోవాలంటే కచ్చితంగా బీఆర్ఎస్ వీలైనన్నీ ఎక్కువ సీట్లు గెలిస్తేనే నాయకులను, కార్యకర్తలను వెళ్లకుండా అడ్డుకోగలరు.