Paritala Sunitha : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజక వర్గంలో ఇంతకాలం వైసీపీ జెండా ఎగిరింది. ప్రస్తుతం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు పరిటాల సునిత ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు.
ఈ క్రమంలోనే రాస్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యాలయం నుంచి ఫోన్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన మంత్రివర్గంలో పరిటాల సునీతకు అవకాశం దక్కలేదు. దీంతో పరిటాల సునీతతో ప్రత్యేకంగా చంద్రబాబు మాట్లాడేందుకు ఆమెను తన ఆఫీసుకు రావాల్సిందిగా పిలిపించారు. ఈరోజు సచివాలయంలో పరిటాల సునీత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలవనున్నారు. మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేకపోయామో సునీతకు చంద్రబాబు ఈ సందర్భంగా వివరించనున్నారు. ఈ పరిస్థితుల్లో ఆమెకు రాయలసీమలో కీలక పదవిని కట్టబెట్టే చాన్స్ ఉందని పార్టీలో ప్రచారం జరుగుతుంది.
ఎన్నికల తర్వాత చంద్రబాబుతో భేటీ అయ్యారు. తన కుమారుడు, ధర్మవరం టీడీపీ ఇన్ చార్జ్ పరిటాల శ్రీరామ్ తో కలిసి విజయవాడలోని చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లిన పరిటాల సునిత పార్టీ అధినేతను సన్మానించారు. రాప్తాడుతో మళ్లీ పార్టీ జెండా ఎగరవేశామని పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ చంద్రబాబుకు చెప్పారు. రాప్తాడులో ఇంతకాలం చాలా ఓపికగా అన్ని సమస్యలను ఎదుర్కొని టీడీపీని గెలిపించినందుకు చంద్రబాబు వారిని అభినందించారు.