Jen Ping : ప్రపంచ సంక్షోభాల నివారణకు నెహ్రూ ప్రతిపాదించిన పంచశీల సిద్ధాంతం ఎంతగానో ఉపకరిస్తుందని చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దాని అవసరం ఎంతో ఉందని అభిప్రాయపడ్డారు. రెండు దేశాల సార్వభౌమత్వాన్ని పరస్పరం గుర్తిస్తూ, శాంతి కోసం పంచశీలను ప్రతిపాదించి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం చైనా బీజింగ్ లో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ ఒప్పందం అనివార్యమైన చారిత్రక పరిణామం. శాంతి, అభివృద్ధికి ఈ ఐదు సూత్రాలు సమాధానమిచ్చాయి. చైనా-భారత్, చైనా-మయన్మార్ తో సంయుక్త ప్రకటనల్లోనూ ఈ సూత్రాలను మా గత నాయకత్వం చేర్చింది. దేశాల మధ్య బలమైన సంబంధాలకు వీటిని ప్రాథమిక నిబంధనలుగా చేర్చాలని సంయుక్తంగా పిలుపునిచ్చింది’’ అని జిన్ పింగ్ గుర్తు చేశారు.
పొరుగు దేశాలకు సంబంధించి ఒకరి అంతరంగిక వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదనే ఉద్దేశంతో భారత్-చైనా మధ్య ఈ ఒప్పందం కుదిరింది. 1954లో ఇరు దేశాల అప్పటి ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, చౌ ఎన్ లై దీనిపై సంతకాలు చేశారు. 1960లో నెహ్రూ ప్రారంభించిన అలీనోద్యమంతో ఈ విధానాలు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందాయి.