Panchayat : ప్రస్తుతం ఓటీటీ కాలం నడుస్తోంది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ నేడు నేరుగా ఓటీటీలో సినిమాలు చూసేస్తున్నారు. అందుబాటులో నేడు అనేక ఓటీటీ యాప్ లు ఉన్నాయి. ప్రతీరోజు ఏదో ఒక సినిమానో లేక వెబ్ సిరీస్ లో రిలీజ్ అవుతూనే ఉన్నాయి. లేటెస్ట్ గా రిలీజైన పంచాయత్ వెబ్ సిరీస్ ను ఇప్పటికే చాలా మంది చూసే ఉంటారు. ఈమధ్యే విడుదలైన మూడో సీజన్ కూడా రిలీజై అదరగొడుతోంది. ఒక చిన్న గ్రామంలో కామెడీ డ్రామా కథాంశంతో తెరకెక్కినా ఈ వెబ్ సిరీస్ కార్పొరేట్ ఉద్యోగులకు పాఠాలు నేర్పుతోంది. అందులో పనికొచ్చే విషయాలు కొన్ని..
‘పంచాయత్’ హీరో నగరంలో పుట్టుతాడు. అతడు అన్ని రకాల సరదాలు, హై-ఫై సౌకర్యాలు అన్నీ ఉన్న నేపథ్యంలో పెరుగుతాడు. పెద్ద కార్పొరేట్ సంస్థలో ఉద్యోగి కావాలనుకున్నా.. తప్పనిసరి పరిస్థితుల్లో మారుమూల పల్లెలో పంచాయతీ కార్యదర్శి ఉద్యోగంలో చేరాల్సి వస్తుంది. దీంతో అతడి జీవితంలో ఒక్కసారిగా ఊహించని మార్పు వస్తుంది. కొత్త ఉద్యోగంలో ఇమడలేకపోతాడు. పల్లెటూరి వాతావరణం అతడికి అస్సలు నచ్చదు. రోజురోజుకీ కష్టాలు పెరిగిపోతుంటాయి. అడ్మినిస్ట్రేషన్‌పై పట్టు ఉండదు. అయినా.. ఆ సవాళ్లతో పోరాటం చేస్తూనే ఒక్కొక్క గండం గట్టెక్కుకుంటూ ముందుకు వెళ్తుంటాడు.
దీని నుంచి మనం ఏం తెలుసుకోవచ్చంటే.. అప్పుడప్పుడే కాలేజీ జీవితం నుంచి ఆఫీసులోకి అడుగు పెట్టినప్పుడు.. మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. కొత్త కొత్త ఇబ్బందులు, సమస్యలు వచ్చి పడుతుంటాయి. అయినా కంగారుపడొద్దు. ఓపికతో ఆలోచిస్తే అన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది.
వాస్తవానికి పెద్ద కార్పొరేట్ ఉద్యోగం మన హీరో కల. కానీ చిన్న ఉద్యోగంలో చేరాల్సి వస్తుంది. ఆ ఉద్యోగం చేసుకుంటూనే అదే తలచుకుంటూ ఉండిపోడు. తన పరిధిలోనే గొప్పగా చేయడానికి ట్రై చేస్తారు. గ్రామ కార్యదర్శిగా ఊరు బాగు పడాలనుకుని తన ఆలోచనను ఆచరణలో పెడుతాడు.
దీని నుంచి మనం ఏం తెలుసుకోవచ్చంటే.. మనం అనుకున్న కొలువు దక్కకపోవచ్చు. దొరికిన ఉద్యోగంలో మాత్రం వందశాతం మనసు పెట్టి పని చేయాలి. అప్పుడు దక్కే సంతృప్తి, వచ్చే గుర్తింపు వెలకట్టలేనిది.
గ్రామ కార్యదర్శి అయినా సర్పంచ్ నుంచి అటెండర్ దాకా ప్రతి ఒక్కరితో హీరో మంచి సంబంధాలు ఏర్పరచుకుంటాడు. ఆ అనుబంధం ఎంత దృఢంగా ఉంటుంది అంటే.. తను బదిలీపై వెళ్లినప్పుడు అంతా కలిసి నిరసన వ్యక్తం చేస్తారు. మళ్లీ తను తిరిగొచ్చేలా చేస్తారు.
దీని నుంచి మనం ఏం తెలుసుకోవచ్చంటే.. పని చేసే చోట అందరితో కలిసిపోతే, అందరూ నావాళ్లే అనుకుంటే.. చిక్కులు, తలనొప్పులే ఉండవు. మనల్ని అంతా ఇష్టపడితే.. పని భారం అనిపించదు.
ఊరు, సన్నిహితులకు ఏవైనా సమస్యలు వస్తే వాటిని పరిష్కరించడానికి క్రియేటివ్ గా ఆలోచిస్తుంటారు కార్యదర్శి. టెక్నాలజీ వాడకం, సీసీకెమెరాల ఏర్పాటు.. ఇలా కొత్తదారిలో సమస్యలకు చెక్ పెడుతుంటాడు.
దీని నుంచి మనం ఏం తెలుసుకోవచ్చంటే.. ఆఫీసులో మనదైన ముద్ర ఉండాలన్నా క్రియేటివ్ గా ఆలోచించాలి. ఎప్పటికప్పుడు తాను అప్‌డేట్ అవుతుండాలి. అప్పుడే గుర్తింపు దక్కుతుంది. ప్రమోషన్ల పరుగులో ముందుంటాం.
కష్టాలు వచ్చినప్పుడు.. ఒక్కో సందర్భంలో ఒక్కొక్క నాయకుడిలా ముందుకొస్తారు. వంటింటికే పరిమితమయ్యే సర్పంచ్ భార్య ఓసారి, గ్రామ సహాయకుడు మరోసారి, ప్రత్యర్థులతో తలపడే సందర్భంలో ఉప సర్పంచ్.. ఇలా ఊరికి వచ్చిన గండాలను గట్టెక్కిస్తుంటారు.
దీని నుంచి మనం ఏం తెలుసుకోవచ్చంటే.. హోదా, వయసు, అనుభవం.. ఇవి చూసి ఎవరినీ ఎప్పుడూ తక్కువగా అంచనా వేయొద్దు. చిన్న అనుకున్నవాళ్లే ఒక్కోసారి గొప్పగా పని చేయొచ్చు. వాళ్ల ప్రతిభను సమర్థంగా ఉపయోగించుకోవాలి.