Pallavi prashanth:బిగ్‌బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేయడం, నాంపల్లి కోర్టులో హాజరు పరచడం తెలిసిందే. ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు చెప్పడంతో పల్లవి ప్రశాంత్‌తో పాటు అతని సోదరుడు మహావీర్‌ను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో అరెస్టై చంచల్ గూడ జైలులో ఉన్న పల్లవి ప్రశాంత్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.
తనపై నమోదైన కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణకు వచ్చిన ఈ కేసుపై వాదనలు విన్న కోర్టు తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ అభిమానులు సంయమనం పాటించాలని ప్రశాంత్ తరుపు న్యాయవాది సూచించారు. దీంతో శుక్రవారం బెయిల్ విషయంలో ఎలాంటి తీర్పు రానుందనే ఉత్కంఠ నెలకొంది. బిగ్ బాస్ ఫినాలే అనంతరం జరిగిన విధ్వంసంలో ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించారంటూ పల్లవి ప్రశాంత్‌పై పలు సెక్షన్‌ల కింద జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు పెట్టి అతన్ని చంచల్ గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే తాజాగా ఈ కేసులో మరో 16 మందిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో నలుగురు మైనర్లు ఉండగా, మిగిలిన 12 మందిని వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టుకు తరలించారు. మైనర్లను జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరు పరచనున్నారు.