Paidithalli Sirimanotsavam : వైభవంగా పైడితల్లి సిరిమానోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
Paidithalli Sirimanotsavam : ఉత్తరాంధ్రుల ఇలవేల్పు విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం మంగళవారం సాయంత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పలు గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో విజయనగరం జనసంద్రంగా మారింది. అమ్మవారి ప్రతిరూపంగా పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమాను అధిరోహించారు. అంజలి రథం, తెల్లటి ఏనుగు రథం, పాలధార, జాలరివల ముందు నడవగా ప్రధాన ఆలయం నుంచి విజయనగరం గపతుల కోట వరకు సిరిమాను ఊరేగింపు కన్నుల పండువగా సాగుతోంది. జై పైడిమాంబ, జైజై పైడిమాంబ అంటూ.. సిరిమానుపై అరటిపండ్లు విసురుతూ భక్తులు మొక్కలు తీర్చుకున్నారు. తమ ఆడపడచు ఉత్సవాన్ని గజపతుల కుటుంబీకులు విజయనగరం కోట నుంచి వీక్షించారు. మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మిడి సంధ్యారాణి, ఎంపీ అప్పలనాయుడు, పలువురు ఎమ్మెల్యేలు, కూటమి నేతలు, జిల్లా కలెక్టర్ అంబేద్కర్ తదితరులు కోటపై ఆశీనులై అమ్మవారి సిరిమానోత్సవాన్ని తిలకించారు.