Medaram Jatara : గద్దెలపైకి పగిడిద్దరాజు, జంపన్నలు!! నేటితో ప్రారంభం కానున్న గిరిజన కుంభమేళ జాతర మేడారం..
Medaram Jatara : సమ్మక్క-సారలమ్మ జాతరకు మేడారం సిద్ధమైంది. రెండేళ్లకోసారి వచ్చే గిరిజన కుంభమేళాగా పిలవబడే మహా జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒడిస్సా, తదితర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు ముట్టజెప్తారు. మేడారం ఇప్పటికే జన సంద్రంగా మారింది. భక్తులు అమ్మవార్లను దర్శించుకొని, బంగారం (బెల్లం) నివేదించుకుంటున్నారు.
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ‘మేడారం’ కొనసాగుతుంది. బుధవారం (ఫిబ్రవరి 21) నుంచి ప్రారంభం కానున్న క్రమంలో జాతరలో భాగంగా నేడు మేడారం రాజు, వనదేవుడు, సమ్మక్క భర్త పగిడిద్దరాజును గద్దెపైకి తీసుకువచ్చే కార్యక్రమం మొదలువుతుంది. సమ్మక్క కుమారుడు జంపన్నను కూడా పూజారులు గద్దెపైకి తీసుకువస్తారు. వీరి రాకతో జాతర ప్రారంభం అవుతుంది. గద్దెల పైకి వచ్చే వన దేవతలు, దేవరలను కాలినడకనే తీసుకురావడం విశేషం.
నేడు పూనుగొండ్లలో దేవుడి గుట్ట నుంచి పగిడిద్దరాజును తీసుకువచ్చి ప్రతిష్టించి శాంతి పూజ చేసిన అనంతరం, పెన్క వంశీయులు పడగ రూపంలో ఉన్న పగిడిద్దరాజును పెళ్లి కొడుకుగా ముస్తాబు చేసి ఆ పడగ రూపాన్ని గ్రామంలో ఊరేగిస్తారు. ఆ తర్వాత పూనుగొండ్ల నుంచి మేడారానికి కాలినడకన తెస్తారు.
ప్రధాన పూజారి జగ్గారావుతో పాటు మరో 10 మంది పూజారులు, భక్తులు పగిడిద్దరాజు వెంట మేడారం పయనం అవుతారు. మధ్యలో గోవిందరావుపేట మండలం, కర్కపల్లి లక్ష్మీపురంలో పెన్క వంశీయుల వద్ద పగిడిద్దరాజు రాత్రి విడిది చేస్తారు. ఇక బుధవారం ఉదయాన్నే బయలుదేరి సారలమ్మ గద్దె చేరుకేనే ముందే పగిడిద్దరాజును మేడారం గద్దెపైకి చేరుస్తారు.
సమ్మక్క కొడుకు జంపన్నను కన్నెపల్లి నుంచి పోలెబోయిన వంశస్తులు మేడారం గద్దెలపైకి తీసుకువస్తారు. పూజారి పోలెబోయిన సత్యమైన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మంగళవారం (ఫిబ్రవరి 20) సాయంత్రం 5 గంటలకు జంపన్నతో కన్నెపల్లి నుంచి బయలుదేరి రాత్రి ఏడు గంటలకు మేడారం చేరుకుంటారు. ఆపై లక్షల మంది భక్తుల మధ్య జంపన్నను గద్దెపై ప్రతిష్టిస్తారు. పగిడిద్దరాజు గద్దెల మీదికి చేరుకోవడంతో జాతరలో ప్రధాన ఘట్టానికి అంకురార్పణ జరుగుతుంది.