Padma Vibhushan Award : కేంద్ర ప్రభుత్వం గురువారం రాత్రి పద్మ అవార్డులను ప్రకటించింది. తెలుగు జాతికి గర్వకారణమైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవిలకు ప్రతిష్ఠాత్మక పద్మ విభూషణ్ అవార్డులను ప్రకటించారు. వీరితో సహ మరో ముగ్గురిని ఈ అవార్డులకు ఎంపిక చేశారు. వారిలో వైజయంతి మాల బాలి, పద్మా సుబ్రహ్మణ్యమ్, బిందేశ్వర్ పాఠక్ ఉన్నారు.
ఈ ఏడాది మొత్తం 132 మందికి పద్మ అవార్డులు ప్రకటించారు. 5గురికి పద్మవిభూషణ్, 17మందికి పద్మభూషణ్, 110మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను బిహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ కు మరణానంతరం ప్రకటించిన సంగతి తెలిసిందే.
75ఏండ్ల వెంకయ్య నాయుడు తన 46ఏండ్ల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, బీజేపీ రాష్ట్ర, జాతీయ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా, ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. అనుపమాన తన వాగ్దాటితో అసేతుహిమాచలం అభిమానగణాన్ని సొంతం చేసుకున్నారు. 2017 నుంచి 2022 మధ్యకాలంలో ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. గతంలో వాజ్ పేయి హయాంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిగా, నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిగా పనిచేశారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి పునాదిరాళ్లతో తన సినిమా ప్రయాణం మొదలుపెట్టారు. ‘‘నటన అంటే కమల్, స్టైల్ అంటే రజనీ, ఈ రెండూ ఉన్న కథానాయకుడు చిరంజీవి’’ అని అగ్ర దర్శకుడు బాలచందర్ తో కితాబు అందుకున్న నటుడు మన చిరంజీవి. ఖైదీతో తెలుగు సినిమాను కొత్త పుంతలు తొక్కించిన నటుడు ఆయన. డ్యాన్స్, ఫైట్స్, స్టైల్ అంటే చిరంజీవి. మాస్ అంటే సినిమా జనానికి చూపించిన ఘనత మెగాస్టార్ దే. 157 సినిమాల్లో నటించిన చిరు.. సామాజిక సేవలోనూ ముందున్నారు. గతంలోనే పద్మభూషణ్ అవార్డు అందుకున్న ఆయన ఇప్పుడు రెండో అత్యున్నత పురస్కారాన్ని అందుకోబోతున్నారు.
ఈసందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ..ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని తెలిపారు. నవ భారత నిర్మాణంలో భాగస్వాములు అవుతున్న ప్రతీ ఒక్కరికి తన పురస్కారం అంకితమని పేర్కొన్నారు. తనతో పాటు అవార్డుకు ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
కాగా, పద్మభూషణ్ అవార్డు రావడంపై చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఈ వార్త విన్న తర్వాత తనకు మాటలు రావడం లేదని భావోద్వేగానికి గురయ్యారు. తన అభిమానులు, కుటుంబ సభ్యుల సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు. తన సాధ్యమైనంత వరకు అవసరమున్నవారికి సాయం చేస్తున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా భారత ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి, తాను ఈస్థాయికి రావడానికి కారణమైన వారందరికీ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.