Pawan Kalyan : ఓ ప్రైవేటు విద్యాసంస్థ యాజమాన్యం వేధింపులతో తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని, న్యాయం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఆమె తల్లిదండ్రులు మొరపెట్టుకున్నారు. బాధితులు తెలిపిన ప్రకారం.. డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చిలకలపాడుకు చెందిన చెక్కపల్లి శ్రీనివాస్ కు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తో వెన్నెల శ్రీషిర్డీసాయి విద్యానికేతన్ లో పదో తరగతి చదువుతోంది. దసరా సెలవులు ఇవ్వకపోవడంతో గత నెల 6న కలెక్టర్ కు వెన్నెల ఫోన్ చేసి సెలవులివ్వకుండా తరగతులు నిర్వహిస్తున్నారని ఫిర్యాదు చేసింది. ఆ మర్నాటి నుంచి పాఠశాలకు సెలవులు ప్రకటించి 14న తిరిగి తెరిచారు. వెన్నెలను స్కూలు డైరెక్టర్ ఉమారాణి పిలిచి.. కలెక్టర్ కు ఎందుకు ఫిర్యాదు చేశావని ప్రశ్నించడంతో పాటు పదో తరగతి ఫెయిల్ చేస్తామని బెదిరించినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో వెన్నెల 18న ఇంట్లో ఉరి వేసుకొని మృతి చెందింది. యాజమాన్యం కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు విలపించారు.
శుక్రవారం ఉదయం రాజమండ్రి విమానాశ్రయానికి వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ దృష్టికి తమ సమస్యను తీసుకు వెళ్లేందుకు వెన్నెల తల్లిదండ్రులు ప్రయత్నించారు. వినతిపత్రం అందిస్తూ కాన్వాయ్ కి అడ్డుపడి న్యాయం చేయాలని వేడుకున్నారు. తిరుగు ప్రయాణంలో ఇక్కడికే వస్తానని, సమస్య పరిష్కరిస్తానని ఆయన వెల్లడించారు. దీంతో వారు అక్కడే వేచి ఉన్నారు. సాయంత్రం వచ్చిన డిప్యూటీ సీఎం వారితో మాట్లాడి సమస్య తెలుసుకున్నారు. అండగా ఉంటానని, న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.