JAISW News Telugu

Miss AI : ‘మిస్‌ ఏఐ’ ఫైనలిస్ట్‌ల్లో మన భామ.. ఎవరీ జారాశతావరీ!

Miss AI

Miss AI

Miss AI : అంతర్జాతీయ అందాల పోటీల్లో భారత్‌కు చెందిన జారా శతావరీ పోటీ పడుతోంది. వందల మందిని వెనక్కి నెట్టి టాప్‌-10 ఫైనలిస్ట్‌లో చోటు దక్కించుకుంది. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా? అందగత్తెల పోటీలు సహజమే అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు కిటుకు..! ఈ ‘జారా శతావరి’ అమ్మాయి కాదు.. అంతెందుకు అసలు మనిషే కాదు. కృత్రిమ మేధ(AI)తో సృష్టించిన ఓ డిజిటల్‌ భామ.

ఏఐతో పుట్టిన భామలు కొద్ది రోజులుగా నెట్టింట్లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. రీల్స్‌, యాడ్స్, ద్వారా ఆకట్టుకుంటున్నారు. వీరు అమ్మాయిలు కాదంటే అస్సలు నమ్మలేరు. అందుకే ఈ ఊహ సుందరిల కోసం ‘ఫ్యాన్‌ వ్యూ’ అనే సంస్థ అందాల పోటీలను ఏర్పాటు చేసింది. మిస్‌ ఇండియా, మిస్‌ వరల్డ్‌ వంటి పోటీల్లాగే వీరి ప్రతిభను పరీక్షించి ‘మిస్‌ ఏఐ (Miss AI)’ టైటిల్‌ ఇవ్వనుంది.

ప్రపంచంలో ఈ తరహా పోటీ జరగడం ఇదే తొలిసారి. మొదటి సారి నిర్వహించే ఈ  ‘Miss AI’ పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా 1500 మంది ఏఐ మోడల్స్‌, ఇన్‌ఫ్లుయెన్సర్లు పోటీపడ్డారు. వీరిలో ‘టాప్‌ 10’ ఫైనలిస్ట్‌లను ఎంపిక చేయగా అందులో భారత్‌కు చెందిన జారా శతావరీ చోటు దక్కించుకుంది. ఏఐ భామల లుక్స్, ఈ భామలను సృష్టించేందుకు ఉపయోగించే టెక్నాలజీ, సోషల్ మీడియాలో ఈ భామలు చూపుతున్న ప్రభావం అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎంపిక చేస్తున్నారు. ఈ పోటీలకు నలుగురు న్యాయనిర్ణేతలు ఉండగా.. వీరిలో ఇద్దరు ఏఐ ఇన్‌ఫ్లూయెన్సర్లు. త్వరలోనే ‘మిస్‌ ఏఐ’ విజేతలను ప్రకటించనున్నారు.

జారా శతావరీ ఎవరు క్రియేట్ చేశారంటే..?
భారత్‌లోని ఓ మొబైల్‌ యాడ్‌ ఏజెన్సీ సహ వ్యవస్థాపకుడు రాహుల్‌ చౌదరి జారా శతావరీని సృష్టించారు. జరా ఓ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తోంది. హెల్త్‌, ఫ్యాషన్‌ ట్రెండ్స్‌పై బ్లాగ్స్‌ ప్రచురిస్తోంది. మహిళలు ఎక్కువగా ఎదుర్కొనే హార్మోన్‌ సమస్యలు, పీసీఓఎస్‌, డిప్రెషన్‌ వంటి వాటిపై ‘ఏఐ ఇన్‌ఫ్లుయెన్సర్‌’గా అవగాహన కల్పిస్తోంది. జూన్‌, 2023 నుంచి పీఎంహెచ్‌ బయోకేర్‌ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా జరా వ్యవహరిస్తోంది. 2023, ఆగస్టులో ‘డిజిమోజో ఈ సర్వీసెస్‌ ఎల్‌ఎల్‌పీ’లో ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెటింగ్‌ టాలెంట్‌ మేనేజర్‌గా రిక్రూట్ అయ్యింది. ఈమె ఇన్‌ స్టా ఖాతాకు 7500 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.

కంటెంట్‌ డెవలప్‌మెంట్‌, డేటా అనాలసిస్‌, ఇలా 13 విభాగాల్లో జారాకు నైపుణ్యం ఉందట. కోలముఖం, సోగ కళ్ల అందంతో నిజమైన అమ్మాయిలా ఉన్న జరా ఎంతో మంది కుర్రకారు గుండెలను కొల్లగొడుతోంది. ఇప్పుడు ‘మిస్‌ ఏఐ’ పోటీల్లో ఫైనలిస్ట్‌ జాబితాలో చోటు దక్కించుకుంది. దీంతో ఈమె పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

టాప్ 10లో చోటు దక్కించుకోవడంతో సృష్టికర్త రాహుల్‌ ఆనందం వ్యక్తం చేశారు. ‘ఏఐతో ప్రయోజనాలతో పాటు సవాళ్లు కూడా ఉన్నాయి. అయితే, దీన్ని ఎలా ఉపయోగించుకుంటామో అన్నదానిపై అవి ఆధారపడి ఉంటాయి. అనేక విషయాలపై అవగాహన కల్పించేందుకే జరా సృష్టించబడింది. అందమైన చిరునవ్వుతో జరా ఫాలోవర్లను ఆకట్టుకుంటోంది. దీంతో ఆమె చెప్పే విషయాలను వినేందుకు ఫాలోవర్స్ ఇష్టపడుతున్నారు’ అని రాహుల్ అన్నారు.

ఈ పోటీల్లో మన సుందరికి కిరీటం దక్కాలని ఆశిద్దాం..! ఆల్‌ ది బెస్ట్‌ జారా.

Exit mobile version