Prof. Kodandaram : పేదల కోసం ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనం నిర్మించడానికి ప్రభుత్వం వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రొఫెసర్ కోదండరామ్ పేర్కొన్నారు. ‘ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవన నిర్మాణం’ అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఉస్మానియా ఆసుపత్రి సమస్యను గత ప్రభుత్వం పట్టించుకోలేదని, త్వరలో నూతన భవన నిర్మాణంపై ఈ ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. ప్రభుత్వం నూతన భవనాన్ని నిర్మిస్తే ఎంతో మంది పేదలకు మేలు జరుగుతుందన్నారు. మంచి లక్ష్యంతో పనిచేస్తున్న వైద్యులకు అండగా ఉంటామని తెలియజేశారు. ఈ సమస్యను త్వరలో వైద్యారోగ్యశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామన్నారు.
ప్రభుత్వం చొరవ తీసుకుని ఆసుపత్రి భవనాన్ని త్వరగా నిర్మించాలని ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ రమేష్ కోరారు. చంచల్ గూడ జైలు లేదా పేట్లబుర్జ్ ప్రాంతాల్లో ప్రింటింగ్ ప్రెస్ ఏరియాలో నూతన భవనాన్ని నిర్మించాలని కోరారు. ఈ సమస్య ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున, ప్రభుత్వం తన నిర్ణయాన్ని వీలైనంత త్వరగా కోర్టుకు తెలియజేయాలని అభ్యర్థించారు.