PM Modi:కేసీఆర్‌కు ప్రమాదం..స్పందించిన పీఎం మోదీ
PM Modi:తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, గులాబీ నేత కేసీఆర్ ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్‌లోని బాత్ రూమ్‌లో ప్రమాదానికి గురి కావడం తెలిసిందే. గురువారం అర్థ్రరాత్రి ప్రమాదానికి గురి కావడంతో ఆయనని సోమాజిగూడలోని యశోద హాస్పటల్లో చేర్పించారు.
తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్ విడుదల చేసిన డాక్టర్లు కేసీఆర్ ఎడమ తుంటి యముక విరిగిందని స్పష్టం చేశారు. అంతే కాకుండా ఆయనకు శస్త్ర చికిత్స అవసరమని, చికిత్స అనంతరం 6 నుంచి 8 వారాల పాటు కేసీఆర్‌కు విశ్రాంతి అవసరమని వెల్లడించారు. ఇదిలా ఉంటే కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కేసీఆర్ కోలుకోవాలని ఆకాంక్షించారు.
`తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌గారికి గాయం అయిందని తెలిసింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఆయన త్వరగా కోలుకోవాలి. మంచి ఆరోగ్యంతో ఆయన తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా` అంటూ పోస్ట్ చేశారు.