NEET : ‘నీట్’పై చర్చకు విపక్షాల పట్టు.. ఉభయ సభలు వాయిదా
NEET : నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టడంతో లోక్ సభ, రాజ్యసభ వాయిదాపడ్డాయి. నీట్ పేపర్ లీక్ వ్యవహారం ప్రత్యేక పార్లమెంట్ వ్యవహారాల్లో దుమారం రేపుతోంది. నీట్ పరీక్షపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో లోక్ సభ, రాజ్యసభలో గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రతిపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు వాయిదాపడ్డాయి.
ఈరోజు ఉదయం 11 గంటలకు లోక్ సభ ప్రారంభం కాగానే ఇటీవల మృతి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులకు సభ సంతాపం ప్రకటించింది. అనంతరం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. దీనిపై స్పీకర్ చర్చను ప్రారంభించగా ప్రతిపక్షాలు నీట్ అంశాన్ని లేవనెత్తాయి. నీట్ పేపర్ లీక్ అంశంపై విద్యార్థుల కోసం సభలో చర్చించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కోరారు. అందుకు సభాపతి ఓం బిర్లా అంగీకరించక పోవడంతో విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.
రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నీట్ అంశంపై చర్చకు చేపట్టాలని విపక్ష సభ్యలు నినాదాలు చేశారు. వారి ఆందోళనల నడుమ కొంతసేపు ఛైర్మన్ సభను నడిపించారు. అయినప్పటికీ వారు తగ్గకపోవడంతో ఛైర్మన్ జగ్ దీప్ ధన్ ఖడ్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.