Vangalapudi Anitha: అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు.. ప్రజలు తలుచుకోవాలే గానీ ఏదైనా సాధ్యమే. అదే ఇప్పుడు ఏపీలో, అదే ఏపీ హోం మినిస్టర్ విషయంలో జరిగింది. ఒకప్పుడు ప్రజల సమస్యలపై అర్జీలు పెట్టుకునేందుకు వస్తే ఆమెను తిప్పి పంపించారు. ఇంతటితో ఆగకుండా ఘోరంగా అవమానించారు. అప్పుడు ఆమె వారితో శపథం చేసింది. ఆ శపథం ఈ రోజు (జూన్ 14) నెరవేరింది. ఈ విషయాలను స్వయంగా మంత్రి ఒక ఛానల్ కు వివరించింది. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు, ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఉంచాలో వారికి తెలుసని ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది.
అసలు విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ మంత్రిగా వంగలపూడి అనిత బుధవారం (జూన్ 12) రోజున ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆ రోజు సీఎం చంద్రబాబు శాఖలను కేటాయించలేదు. రెండు రోజుల తర్వాత అంటే జూన్ 14 (శుక్రవారం)న ఆయా మంత్రులకు శాఖలను కేటాయించారు. శాఖల కేటాయింపులో వంగలపూడి అనితకు హోంశాఖ ఇచ్చారు. దీంతో ఆమె తన అధికార కార్యాలయంలోకి ఈ రోజు శుక్రవారం గౌరవంగా వెళ్లారు. పోలీస్ బాస్ డీజీపీ, పోలీస్ సిబ్బంది ఆమెకు గౌరవ వందనం సమర్పించి ఆహ్వానించారు. దీంతో ఆమె ఎమోషనల్ గా మాట్లాడారు.
జగన్ అరాచక పాలన చేస్తున్న వేళ తాను తమ ప్రజల గోడు వినిపించేందుకు వచ్చానని తనను పోలీసులు అవమానించారని వాపోయారు. తను వినతిపత్రం ఇచ్చేందుకు వస్తే డీజీపీకి, ఎస్పీకి ఇవ్వనివ్వలేదు. కానిస్టేబల్ కు ఇవ్వమన్నారు. ఆ సమయంలో రిప్రజంటేషన్ చింపేసి వెళ్లిపోయా. అప్పుడు తాను శపథం చేశానని ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడికే గౌరవంగా వస్తానని చెప్పానని ఇప్పుడు ఇదే కార్యాలయానికి గౌరవంగా వచ్చానని అన్నారు. బయట నిలబడితే కనీసం డీపీజీ ఆఫీస్ లోకి అనుమతి లేదని చెప్పారని, కానీ నేడు వాళ్లే ప్రొటోకాల్ తో లోపలికి తీసుకెళ్లారు.