Mahesh Babu : ‘గుంటూరు కారం’ను మహేష్ మాత్రమే కాపాడాలి!
Mahesh Babu : ఆది నుంచి గుంటూరు కారం అగచాట్లు పడుతూనే ఉంది. సినిమా ఏ ముహూర్తాన ప్రారంభించారో గానీ వాయిదాల మీద.. వాయిదాలు పడుతూ వస్తోంది. మహేశ్ బాబు త్రివిక్రమ్ కాంబో అంటే తెలుగు ఆడియన్స్ కు స్పెషల్ అని చెప్పవచ్చు. కానీ ఈ సినిమా మాత్రం ఫుల్ ట్విస్ట్ లతో సాగుతూ వస్తోంది.
సినిమా షూటింగ్ ను 2021, మేలో మొదటి పెట్టారు. తొలి భాగంలో మహేశ్ బాబు తల్లి మరణించారు. ఆ డీప్రెషన్ నుంచి మహేశ్ బయటకు వచ్చి మళ్లీ షూటింగ్ ప్రారంభం కాగానే ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మరణించాడు. షూటింగ్ ప్రారంభమైన రెండేళ్ల తర్వాత టైటిల్ ను ఖరారు చేశారు. అంటే టైటిల్ ను 2023, మేలో అనౌన్స్ చేశారు. ఇక ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా మరో గండం వచ్చి పడింది. జనవరి 6వ తేదీకి అన్ని సమకూర్చుకొని అనుమతికి దరఖాస్తు చేయగా పోలీసులు నిరాకరించారు. దీంతో వాయిదా వెయ్యాల్సి వచ్చింది.
మూవీ మొదలు పెట్టిన కొంత సమయం తర్వాత హీరోయిన్ ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలగింది. ఆ తర్వాత సినిమాటో గ్రాఫర్, ఆ తర్వాత ఫైట్ మాస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా మారుతున్నట్లు గాసిప్ లు వచ్చాయి. కానీ ఇదొక్కటే ఆగినట్టుంది. ఇన్ని జరిగిన సినిమా అభిమానులను ఏ మేరకు అలరించబోతుందో.. ఇటీవల రిలీజైన థియేట్రికల్ ట్రైలర్ మాత్రం ఆ మేరకు ఆకట్టుకోలేకపోయింది.
మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో అతడు, ఖలేజా వచ్చాయి. ఈ రెండు కూడా ఆడియన్స్ కు బాగా రీచ్ అయ్యాయి. కానీ ఈ సినిమా విషయంలో అభిమానుల్లో కొంచెం సంశయం నెలకొన్నట్లు తెలుస్తోంది. ఆదివారం రిలీజైన ట్రైలర్ 24 గంటల్లో రికార్డు వ్యూస్ అండ్ లైక్స్ తో దూసుకుపోవడం వాస్తవమే. ఇదంతా సిల్వర్ స్క్రీన్ పై సినిమాకు దోహదం చేస్తుందా..? అంటే ఖచ్చితంగా కాదనే చెప్పవచ్చు.
ఒక సాధారణ కథను కూడా స్క్రీన్ ప్రజెన్స్ తో, డైలాగ్స్ తో ప్రేక్షకులను సమ్మోహితులను చేయడం మిల్క్ బాయ్ కి వెన్నతో పెట్టిన విద్య. దీంతో గుంటూరు కారం’ విజయావకాశాలు అంతా మహేష్ పైనే నిలిచాయి. ‘సర్కారు వారి పాట’ సాధారణ కథ కూడా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ వసూళ్లు రాబట్టిందంటే అది కేవలం మహేశ్ స్క్రీన్ ప్రజెంటేషన్ అనే చెప్పాలి. ఆ మాటకొస్తే ఒక్క సర్కారు వారి పాట మాత్రమే కాదు, బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయిన ‘1 నేనొక్కడినే’ సినిమాను కూడా క్లాసిక్స్ గా మార్చిన ఘనత మహేష్ బాబు సొంతం.
అలాంటి మహేశ్ ‘కుర్చీని మడతపెట్టి’ పాటలో వేసిన స్టెప్పులతో ఊగిపోయిన అభిమానులకు ట్రైలర్ కావాల్సినంత ‘కిక్’ ఇవ్వలేకపోయినట్లు కామెంట్లు వినిపిస్తున్నాయి. కానీ సూపర్ స్టార్ ను చూపించిన తీరుకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారట. రెండున్నర్ర నిముషాల ట్రైలర్ ను చూసి రెండున్నర్ర గంటల సినిమాను డిసైడ్ చేయడం సబబు కానప్పటికీ, ‘ఖలేజా’ మాదిరిగా సిల్వర్ స్క్రీన్ పై మరిన్ని సర్ ప్రైజ్ లు ఉంటాయేమోనన్న ఆశతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ గుంటూరు కారంలో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ రచ్చకు సిద్ధమవుతున్నారు.