Pawan Kalyan : విజయమో..వీరస్వర్గమో అన్నట్టు పోరాడితేనే పట్టం..

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan : తెలుగు స్టార్ హీరో పవన్ కల్యాణ్ క్రేజ్ ఓ రేంజ్ లో ఉంటుంది. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా లక్షలాది అభిమానగణం ఆయన వెంట ఉంది. పవన్ కున్న మాస్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. హై రేంజ్ లో స్టార్ డమ్ అనుభవిస్తున్నా.. ప్రజాసేవ కోసమంటూ రాజకీయాల్లోకి వచ్చారు. జనసేన పేరుతో పార్టీ పెట్టి దాదాపు పదేళ్లు అవుతోంది. ఆయనకు ఎంతో జనాదరణ ఉన్నా పార్టీ మాత్రం అభిమానుల స్థాయి దాటలేకపోయింది. అందుకే 2019 ఎన్నికల్లో పవన్ పోటీ చేసినా రెండు చోట్ల ఓడిపోయారు.

2014 ఎన్నికల్లో జనసేన పార్టీ చేయలేదు. ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమిని గెలిపించడానికి పవన్ చాలా కష్టపడ్డారు. రాష్ట్రమంతా కలియదిరిగి ఉర్రూతలూగించే ప్రసంగాలతో కూటమిని గెలిపించడానికి తన వంతు సాయమందించారు. ఇక 2019 ఎన్నికల్లో పోటీ చేసి కేవలం ఒక్క సీటు మాత్రమే గెలవగలిగారు. పోటీ చేసిన రెండు చోట్ల పవన్ సైతం ఓడిపోయారు. అయితే అప్పుడు ఆయన పార్ట్ టైం రాజకీయాలు చేయడం, ప్రజాసమస్యలపై గుర్తుకువచ్చినప్పుడే పోరాడడం, అభిమానగణం భారీగానే ఉన్నా సగటు ప్రజల్లో అంతగా ఆదరణ లేకపోవడం, క్షేత్రస్థాయిలో పార్టీ బలహీనంగా ఉండడం, అభ్యర్థులు ఖర్చు పెట్టకపోవడం వంటి కారణాలతో పార్టీ దారుణ ఫలితాలను చవిచూసింది.

ఇక ఈ ఐదేళ్లలో జనసేనకు బాగానే జోష్ వచ్చింది. పవన్ కూడా గతంలో కంటే కాస్త ప్రజల్లో ఉన్నారు. దీంతో జనసేనకు ఈసారి మంచి ఫలితాలు వస్తాయనే భావన జనాల్లో ఉంది. అయితే ఆయన తీరుతోనే పార్టీకి మైనస్ అవుతుందా? అని పలువురిలో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే జనసేన అభ్యర్థులను ప్రకటించారు. ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు, అటు వైసీపీ అధినేత జగన్ తమ ప్రచారాన్ని మొదలుపెట్టేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గాన్ని తిరిగేందుకు వ్యూహా రచన కూడా చేసుకున్నారు. కానీ జనసేనాని మాత్రం ఇప్పటివరకు ప్రచార బరిలోకి దిగలేదు.

మూడు పార్టీలు కలిసి పెట్టిన చిలకూరిపేట బహిరంగ సభకు మాత్రం హాజరయ్యారు. ఆ తర్వాత ఇక ఏ సభ, రోడ్ షో నిర్వహించలేదు. పార్టీకి జీవన్మరణ సమస్యలాంటి ఎన్నికలు సమీపిస్తున్న టైంలో ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఇంకా సహచర పార్టీలతో సమావేశాలు, వేసవి కాలం విశ్రాంతి అంటూ ఢిల్లీ, హైదరాబాద్ లలో చక్కర్లు కొట్టడం..ఇవన్నీ ఆహ్వానించదగ్గవి కాదు. మలివిడత వారాహి యాత్రను వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు.

కీలకమైన ఎన్నికలకు 50 రోజుల టైం కూడా లేదు. ఈ సమయాన్ని పకడ్బందీగా వాడుకోవాలి. ప్రతీ నిమిషం ప్రజల మధ్యలో ఉండాలి. తాను గెలవాలి..తనవాళ్లను గెలిపించుకోవాలి.. పోటీ తీవ్రంగా ఉంటుందనేది పవన్ గుర్తుంచుకోవాలి. పిఠాపురంలో పవన్ ను ఓడించేందుకు జగన్ ఎన్ని ప్రయత్నాలైన చేస్తాడు. ఒకవేళ పవన్ ఇలా వాయిదా పద్ధతులు అవలంబిస్తే అక్కడ గెలవడం కష్టం కావొచ్చు. ఇవన్నీ పవన్ పరిగణలోకి తీసుకోవాలి. తక్షణమే క్షేత్రస్థాయిలోకి వెళ్లి విజయమో, వీర స్వర్గమో అన్నట్టు ప్రచార బరిలో నిలువాలి.

TAGS