Saraswati lands : వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కు చెందిన సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ కు చెందిన భూముల్లో అటవీ శాఖ సిబ్బంది రెండో రోజు ఆదివారం పరిశీలన కొనసాగింది. సోమవారం కూడా తనఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఆ పరిశ్రమ ఆధీనంలో ఉన్న భూముల్లో ప్రభుత్వ, అటవీ భూములున్నాయా? అన్న అంశంపై పరిశీలించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరం మండలం చెన్నాయపాలెంలో పరిశ్రమ భూములున్న ప్రాంతంలో కొలతలు తీస్తున్నారు. మండలంలోని రేగులగడ్డ, వేమవరం రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో కూడా అటవీ శాఖ సిబ్బంది పరిశీలించారు. దాచేపల్లి సెక్షన్ డిప్యూటీ రేంజ్ అధికారి విజయలక్ష్మి ఆధ్వర్యంలో సిబ్బంది 30 పాయింట్ల జీపీఎస్ రీడింగ్ చూశారు. గూగుల్ ఎర్త్ లో రీడింగ్ చెక్ చేశారు.