Dubai : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దుబాయ్, పరిసర ప్రాంతాల్లో భారీ వరదలు సంభవించాయి. యూఏఈలో అత్యధిక వర్షపాతం నమోదైన ఘటన ఇది. ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 17 వరకు దుబాయ్ లో కేవలం 12 గంటల్లోనే వర్షాలు కురవడంతో వరదలు ముంచెత్తాయి. ఆస్తి నష్టంతో పాటు ప్రాణనష్టం కూడా భారీగానే జరిగింది. దాదాపు 18 మంది దాక మృతి చెందినట్లు తెలుస్తోంది.
రాజధాని అబుదాబిలోని ఉత్తర, తూర్పు ప్రాంతాలు భారీ వర్షాలతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. వర్షపాతం 4 నుంచి 8 అంగుళాలు (100 నుంచి 200 మి.మీ) మధ్య ఉంది. కొన్ని చోట్ల 10 అంగుళాల వర్షం కూడా కురిసింది. దుబాయ్ చరిత్రలో ఇదే అతి పెద్ద వర్షపాతం.
దుబాయిలో కురిసిన భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలు ఆస్తి, మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం కలిగించాయి. పలు వాహనాలు మునిగిపోగా, మిగిలినవి దెబ్బతినడంతో రవాణాపై తీవ్ర ప్రభావం పడింది. ఈ సంఘటనతో నీరు, విద్యుత్, కమ్యూనికేషన్ నెట్ వర్క్ వంటి ప్రధాన సరఫరాలకు అంతరాయం ఏర్పడింది. ఆకాశాన్నంటే అద్దాల మేడలు, భారీ షాపింగ్ మాల్స్ తో కళకళలాడే దుబాయ్ నగరం.ఇప్పుడు తుఫాన్ ధాటికి జలమయంగా మారిపోయింది.
దుబాయ్ లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను, జలప్రళయాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని అక్కడి జనం చెబుతున్నారు. సోషల్ మీడియా వేదికల్లో తమ దీన పరిస్థితిని చూపించే విధంగా వర్షాలు, వరదల వీడియోలను షేర్ చేస్తున్నారు. ఈ వరదలతో దుబాయ్ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన పర్యాటక రంగానికి భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సందర్శకులు రాకపోవడంతో పలు పర్యాటక ప్రాంతాలను మూసివేశారు. ఇప్పుడు దుబాయ్ కోలుకోవడం పెద్ద సవాలే అని చెప్పవచ్చు. ఎడారి దేశం ఇలా కావడం ప్రకృతి వైపరీత్యంతో పాటు మానవుడు చేసే తప్పిదాలే కారణమని ప్రకృతి ప్రేమికులు చెబుతున్నారు.