One Nation One Election : వన్ నేషన్ – వన్ ఎలక్షన్ దిశగా భారత్ : ప్రధాని
One Nation One Election : వన్ నేషన్ – వన్ ఎలక్షన్‌పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విధానంతో దేశం మరింత బలపడుతుందని వ్యాఖ్యానించారు. గతంలో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇచ్చాయని.. అందుకే వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అంటూ ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఒకే దేశం-ఒకే ఎన్నికల బిల్లును ప్రవేశపెడతామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ ఏడాది ప్రారంభంలోనే ఈ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వివరించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 149వ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి ప్రధాని మోదీ పూలమాల వేసి నివాళులర్పించారు.
‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ దిశగా అడుగులు వేస్తున్నాం. వన్ నేషన్ – వన్ ఎలక్షన్ తో దేశం మరింత బలపడుతుంది. వన్ నేషన్ వన్ రేషన్ తో పేద ప్రజలు లబ్ధి పొందుతున్నారు. త్వరలో వన్ నేషన్ – వన్ సివిల్ కోడ్ తీసుకొస్తాం. తద్వారా దేశంలో వివక్ష అంతమవుతుంది. ఉగ్రవాదాన్ని ఉపేక్షించవద్దు. ఉక్కుపాదం మోపుతాం అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ‘‘ఇంతకుముందు దేశంలో వివిధ పన్నుల వ్యవస్థలు ఉండేవి. ఒకే దేశం ఒకే పన్ను విధానం జీఎస్‌టీని రూపొందించాం. వన్ నేషన్ వన్ పవర్ గ్రిడ్‌తో దేశ విద్యుత్ రంగాన్ని బలోపేతం చేస్తున్నాం.. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ ద్వారా పేదలకు అందుబాటులో ఉండే సౌకర్యాలను ఏకీకృతం చేశాం. ఆయుష్మాన్ భారత్ రూపంలో దేశ ప్రజలకు ఒకే ఆరోగ్య బీమా… ఒకే దేశం, ఒకే ఆరోగ్య బీమా కల్పించాం’’ అని మోదీ వివరించారు.