Telangana : జోరులో ఒకరు.. బేజారులో కారు ..
Telangana : తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఇవ్వాలనుకున్న తీర్పును సరిగానే ఇచ్చారనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. మే 13 న ఎన్నికలు ముగిశాయి. జూన్ నాలుగున ఫలితాలు వెల్లడయ్యాయి. దాదాపుగా అసెంబ్లీ ఎన్నికల్లో చూపించిన రుచిని ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో సైతం రాజకీయ పార్టీలకు చూపించినట్టు చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పదేళ్ల అధికారానికి ఓటర్లు మంగళం పాడారు. టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాషాయం అభ్యర్థులు అసెంబ్లీలో నలుగురు ఉండేవారు. తాజా అసెంబ్లీ లో ఆ సంఖ్య ఎనిమిదికి చేరింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రము నుంచి బీజేపీ అభ్యర్థులు నలుగురు విజయం సాధించారు. ఇప్పుడు కాషాయం రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు రెట్టింపు కావడంతో కాషాయం శ్రేణుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఎనిమిది మంది అభ్యర్థులు సత్తా చాటారు. ఇది ఎవరూ ఊహించలేదు. అదేవిదంగా తాజా పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ఎనిమిది మంది విజయ పథకాన్ని ఎగురవేసి తెలంగాణలో పార్టీ కి తిరుగులేదని చాటిచెప్పారు.
కాంగ్రెస్ పార్టీకి 2019 లో రాష్ట్రము నుంచి ముగ్గురు ఎంపీ లు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య ఎనిమిది కి చేరింది. పదేళ్ల అధికారాన్ని అంటిపెట్టుకొని ఉన్న కేసీఆర్ ప్రభుత్వం పడిపోవడంలో కాంగ్రెస్ పార్టీ గట్టి పోరాటమే చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం అధికారాన్ని దక్కించుకొంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో కొంత మోదం, కొంత ఖేదం అనే విదంగా కాంగ్రెస్ పార్టీ ఫలితాలు సాధించింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే జరిగిన ఎన్నికలు కాబట్టి మెజార్టీ గతం కంటే ఎక్కువ రావాల్సి ఉండేది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన మెజార్టీ ప్రకారం కాంగ్రెస్ పరిస్థితి సరిగానే ఉండనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
2019 పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి తొమ్మిది మంది ఎంపీ లు ఉన్నారు. జూన్ నాలుగున వెల్లడైన ఫలితాల్లో కారు జోరు జీరో అయ్యింది. పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ కనీసం ఒక్క స్థానం కూడా నిలుపు కోకపోవడం శోచనీయం. కేసీఆర్ అభ్యర్థుల గెలుపు కోసం బస్సు యాత్ర చేపట్టిన ఫలితం శూన్యం అయ్యింది. అత్యధిక స్థానాల్లో మూడో స్థానంతోనే సరిపెట్టుకొని కారు పార్టీ ప్రస్తుతం బేజారై బజారులో పడిందనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.