Employees Donations : వరద బాధితులకు సుమారు రూ.100కోట్ల ఉద్యోగుల ఒకరోజు వేతనంను విరాళంగా ఇస్తున్నట్లు తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షణ కమిటీ ఛైర్మన్ వి.లచ్చిరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం తగు సహాయక చర్యలను సైతం వేగవంతం చేసిందన్నారు. రాష్ట్రంలోని అన్ని విభాగాల ప్రభుత్వ ఉద్యోగుల సైతం సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని గుర్తు చేశారు. అయినప్పటికీ విపత్తు భారీగానే నష్టాన్ని కలిగిచిందన్నారు. ఈ ఘటన తమను తీవ్రంగా కలిచి వేసిందన్నారు.
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనిని అతిపెద్ద విపత్తుగా తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ భావించిందన్నారు. ఇలాంటి సమయంలో తమ వంతుగా ప్రభుత్వానికి ఆర్ధిక పరంగా చేయూతగా నిలవాలని భావించామన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోని ఉద్యోగుల తరుపున ఒక రోజు వేతనం సుమారు రూ.100 కోట్లను ప్రభుత్వానికి ఇచ్చేందుకు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి తమవంతు సహాయంగా ఒకరోజు వేతనం వరద సహాయక చర్యలకు అందిస్తున్నామని తెలిపారు.
తెలంగాణలోని అన్ని ప్రభుత్వ విభాగాలలోని ఉద్యోగుల తరుపున సమష్టి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వంలో భాగంగా ఉన్న ఉద్యోగులుగా వరద విపత్తు సృష్టించిన ప్రాంతాలలో ప్రత్యక్షంగా సహాయక చర్యలలో పాల్గొనడంతో పాటు తమ బాధ్యతగా ఒక రోజు వేతనాన్ని విరాళంగా అంద చేయనున్నట్టుగా ఆయన చెప్పారు.