Microsoft : కోటి మంది భారతీయులకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లో శిక్షణ.. సత్య నాదెళ్ల సంచలనం
Microsoft : ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారత్ లో భారీగా పెట్టుబడులు పెట్టనుంది. దేశంలో క్లౌడ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను విస్తరించడం.. డేటా సెంటర్‌లను విస్తరించడం కోసం 3 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ చైర్మన్ , సీఈవో సత్య నాదెళ్ల ప్రకటించారు. 2030 నాటికి 10 మిలియన్ల మందికి (ఒక కోటి మందికి) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్‌లో శిక్షణ ఇస్తామని కూడా ప్రకటించారు. మంగళవారం బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
▪2030 నాటికి కోటి మంది భారతీయులకు కృత్రిమ మేధపై (AI) నా సంస్థ తరఫున శిక్షణ ఇవ్వనున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వెల్లడించారు. భారత్ లో క్లౌడ్ సేవలు, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణకు మూడు బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు.
ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్న సత్య నాదెళ్ల సోమవారం ప్రధాని మోదీని కలిశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో భారతదేశం అగ్రగామిగా ఉండేలా తన శక్తి మేరకు ప్రతిదీ చేస్తానని హామీ ఇచ్చారు. బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పెట్టుబడిని ప్రకటించారు. భారతదేశంలో రికార్డు స్థాయిలో 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రావడం పట్ల సత్య నాదెళ్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ పెట్టుబడి భారత్‌లో AI ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్న ప్రధాని మోదీ దార్శనికతలో ఇది కీలక పాత్ర పోషిస్తుందన్నారు.