BRS Situation : ఒకప్పుడు ఓవర్ లోడ్.. ఇప్పుడు అభ్యర్థులే దొరకడం లేదు..ఇదే రాజకీయమంటే..

BRS Situation

BRS Situation

BRS Situation : ఒకప్పుడు బీఆర్ఎస్ నుంచి పోటీ అంటే గెలుపు పక్కా అని భావించేవారు. ఒక్కొక్క స్థానం నుంచి పదుల సంఖ్యలో ఆశావహులు ఉండేవారు. కేసీఆర్ కు నచ్చిన వారికి అందలం అందేది. ఆయనకు నచ్చని వారిని అథ:పాతాళం తొక్కేవారు. అయినా కూడా ఆ పార్టీలో ఉంటే ఏదో పదవి వస్తుంది అనుకునేవారు. ఒకవేళ ఏ పదవి లేకున్నా ఏదో రకంగా సంపాదించుకోవచ్చు అనే భావనతో ఉండేవారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోవడంతో అంతా తలకిందులైంది. ఇప్పుడు పోటీ చేయమని బతిమాలినా చేసేవారు లేరు.

బీఆర్ఎస్ కు అభ్యర్థుల కొరత తీవ్రంగా ఉంది. కేసీఆర్ సమీక్షలు చేసి అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. అయితే ఆ అభ్యర్థుల పేర్లను చూసి.. సొంత పార్టీ నేతలే పెదవివిరుస్తున్నారు. వారు కనీస పోటీ అయిన ఇవ్వగలరా అని సందేహపడుతున్నారు. మల్కాజిగిరికి శంభీపూర్ రాజును ఖరారు చేశారు. ఆయన ఎంపీ స్థాయి అభ్యర్థి అని ఎవరూ అనుకోవడం లేదు.

అలాగే జహీరాబాద్ కు గాలి వినోద్ కుమార్ ను, చేవెళ్లకు కాసాని జ్ఞానేశ్వర్ పేరును ఖరారు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు చోట్ల బీఆర్ఎస్ కు భారీ లీడ్ వచ్చింది. కానీ ఈ అభ్యర్థులను చూస్తే గెలిచేందుకేనా అన్న సందేహం వస్తోంది. కేసీఆర్ కుటుంబ సభ్యులు బరిలోకి దిగితే కొన్ని స్థానాల్లో గట్టి పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కవితను ఎందుకు పోటీ చేయించడం లేదన్నది ఆశ్చర్యకరంగా మారింది.

కవిత బీఆర్ఎస్ తరుఫున కాకుండా తెలంగాణ జాగృతి తరుపున రాజకీయ కార్యక్రమాలు చేపడ్తున్నారు. తాజాగా అసెంబ్లీలో ఫూలే విగ్రహం కోసం బీసీ సంఘాలతో కూడా జాగృతి తరుపునే సమావేశం నిర్వహించారు. పైగా బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. పార్టీ  తరుపున నిజామాబాద్ లో ప్రచారం చేయడం లేదు. లోక్ సభ ఎన్నికలు వస్తున్నందున అక్కడ నిలబడబోయే అభ్యర్థి కోసం కూడా కసరత్తు చేయడం లేదు.

కవితను నిజామాబాద్ లో నిలబెట్టడం రిస్క్ అనుకుంటే మెదక్ లోనైనా నిలబెట్టవచ్చు. కానీ కేసీఆర్ కుటుంబ సభ్యులు అసలు పోటీలోనే ఉండొద్దనుకున్నారు. కేటీఆర్ మల్కాజిగిరి నుంచి, కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేద్దామనుకున్నారు. కానీ ప్రస్తుతం ఆ వ్యూహాలన్నింటినీ అటకెక్కించారు.

TAGS