Rishab Shetty:రష్మిక వివాదంపై స్పందించిన రిషబ్ శెట్టి
Rishab Shetty:సైలెంట్‌గా వచ్చి సంచలనం సృష్టించిన కన్నడ మూవీ `కాంతార`. ఈ సినిమాతో కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి అందరిని షాక్‌కు గురి చేసిన విషయం తెలిసిందే. ముందు కన్నడలో విడుదలై ఆ తరువాత మౌత్ టాక్‌తో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. రూ.16 కోట్లతో రూపొందిన ఈ సినిమా అనూహ్యంగా రూ.400 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురి చేసింది.
ఒక్క సారిగా `కాంతార`తో దేశ వ్యాప్తాంగా పాపులారిటీని దక్కించుకున్న రిషబ్ శెట్టి ప్రస్తుతం దీనికి ప్రీక్వెల్‌గా `కాంతార చాప్టర్ 1`ని రూపొందిస్తూ నటిస్తున్నారు. ఇటీవలే ఫస్ట్ లుక్ వీడియోని విడుదల చేసి సినిమాపై అంచనాల్ని పెంచేశారు. ఇదిలా ఉంటే ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివెల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) వేడుకలో రిషబ్ శెట్టి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రష్మిక మందన్నను ఉద్దేశించే రిషబ్ తాజా వ్యాఖ్యలు చేశారని నెట్టింట పెద్ద చర్చే జరిగింది.
చాలా మంది అభిమానులు రష్మిక గురించే రిషబ్ ఈ కామెంట్లు చేశారని ఫైర్ అయ్యారు. తాజా అంశంపై ఓ అభిమాని వివరణ ఇవ్వగా..దానికి రిషబ్ శెట్టి స్పందించారు. తాజాగా గోవాలో జరిగిన ఇఫీ వేడుకల్లో `కాంతార`కు సిల్వర్ పికాక్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా రిషబ్ మాట్లాడుతూ ` `కాంతార` సినిమా పెద్ద హిట్ కావడానికి కారణమైన కన్నడ ప్రేక్షకులకు ధన్యవాదాలు. వాళ్లు ఆదరించడం వల్లే విజయం సాధించింది.
ఆ టాక్ వల్లే ఇతర భాషల్లోనూ సూపర్ హిట్ అయింది. ఒక ప్రాజెక్ట్ హిట్ అయ్యాక కన్నడ ఇండస్ట్రీని వదిలి వేరే భాషల్లోకి నేను వెళ్లను. నేను అలాంటి వ్యక్తిని కాదు` అని పేర్కొన్నారు. అయితే రిషబ్ చేసిన వ్యాఖ్యలు రష్మిక మందన్నని ఉద్దేశించేనని కొంత మంది నెటిజన్లు రిషబ్‌పై కామెంట్లు చేశారు. అంతే కాకుండా రష్మిక `కిరిక్ పార్టీ` విజయం తరువాత కన్నడ చిత్రాలకు మించి ఇతర భాషలపై దృష్టి పెట్టిందని, ఆ విషయాన్నే పరోక్షంగా రిషబ్ వెల్లడించాడని సెటైర్లు వేశారు.
ఈ కామెంట్ల నేపథ్యంలో రిషబ్ అభిమాని ఆయన మాటల ఉద్దేశ్యం వేరని, రిషబ్ చెప్పింది ఎవరినీ ఉద్దేశించి కాదని, ఆయన కన్నడ ఇండస్ట్రీని వదిలి వెళ్లనన్నారని రిషబ్ స్పీచ్‌కు సంబంధించిన వీడియోని ట్వీట్ చేశాడు. దీనిపై రిషబ్ శెట్టి ఆసక్తికరంగా స్పందించారు. `నేను చెప్పింది ఇప్పటికైనా అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు` అన్నారు. దీంతో రిషబ్ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
No problem, ☺️ finally someone understood what I really meant to say. https://t.co/qrHPcgLnij
— Rishab Shetty (@shetty_rishab) December 1, 2023