Prabhas Donation : తోటి వారికి సాయం అందించడంలో ఎప్పుడూ ముందుంటారు రెబల్ స్టార్ ప్రభాస్. ఇప్పటివరకూ ఎన్నో దానాలు చేశారు. ఎంతో మందిని ఆదుకున్నారు. కానీ తాను చేసిన సాయం, దానాన్ని ఎన్నడూ బయటపెట్టుకోలేదు. కానీ ఆ సాయం పొందిన వారే ప్రభాస్ దాతృత్వాన్ని వెల్లడించారు. తాజాగా ప్రభాస్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. కేరళలోని వయనాడ్ ప్రమాదంలో సహాయక చర్యల కోసం తనవంతుగా భారీ విరాళాన్ని అందజేశారు రెబల్ స్టార్ ప్రభాస్.
ప్రభాస్ సాయం ఎంతంటే..
వయనాడ్ ప్రమాదంలో చిక్కుకున్న వారిని పునరావాస, సహాయకచర్యలు అందించేందుకు ప్రభాస్ ఏకంగా రూ.2 కోట్ల విరాళం అందజేశారు. ఈ విషయాన్ని ప్రభాస్ ట్రెండ్స్ టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇంత సాయం చేసినా ఎక్కడా చెప్పుకోకపోవడంతో ప్రభాస్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలువురు టాలీవుడ్ హీరోలు కూడా వయనాడ్ బాధితుల కోసం తమ వంతు విరాళం అందజేశారు.
ఈ ఘటనపై టాలీవుడ్ నుంచి స్పందించిన తొలి హీరో అల్లు అర్జున్. వరద బాధితుల కోసం ఐకాన్ స్టార్ రూ.25 లక్షలు ఇచ్చారు. అనంతరం మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి రూ. కోటి విరాళం ప్రకటించారు. ఇప్పుడు ప్రభాస్ ఏకంగా రూ.2 కోట్లను కేరళ సీఎం సహాయ నిధికి అందజేశారు. ప్రభాస్ పెద్ద మొత్తంలో సాయం చేయడం ఇదేం కొత్తకాదు. గతంలో చాలా సందర్భాల్లో ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ప్రభాస్ తన వంతుగా పెద్ద మొత్తంలో సాయం అందజేశారు.
ఊహకందని విషాదం..
ఇటీవల కేరళలో కురిసిన భారీ వర్షాలు, వరదలకు వయనాడ్ అతలాకుతలమైంది. వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగి పడటంతో భారీ ప్రాణ నష్టం సంభవించింది. ఈ ప్రకృతి విపత్తులో ఎంతోమంది తమ ఇళ్లను, కుటుంబసభ్యులను పొగొట్టుకున్నారు .కొండచరియలు విరిగిపడి ఏకంగా నాలుగు ఊర్లు సైతం నేలమట్టం అయ్యాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకూ ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 390 పైమాటే. మరో 150 మంది ఆచూకీ ఇంకా తెలియలేదు. వీరి ఆచూకీ కోసం ఇండియన్ ఆర్మీ సహా సహాయక సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. ఇంకో 200 మంది దాకా గాయపడిన వారు వైద్యశాలల్లో చికిత్స తీసుకుంటున్నారు. 2018లో కూడా ఇదే తరహాలో కేరళను వరదలు ముంచెత్తాయి.