YS Sharmila : ఒకప్పుడు అన్న కోసం పాదయాత్ర చేశానని.. ప్రస్తుతం న్యాయం కోసం పోరాదుతున్నానని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. పులివెందులలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీతతో కలిసి మాట్లాడారు. హత్యలు చేయడానికే అధికారాన్ని వాడుకుంటున్నారని, అవినాష్ నిందితుడని సీబీఐ చేసిన ఆరోపణల ప్రకారమే మాట్లాడుతున్నామని అన్నారు.
కాల్ రికార్డ్స్, గూగుల్ మ్యాప్స్ వంటి ఆధారాలు ఉన్నా.. బాబాయిని చంపిన హంతకులను సీఎం కాపాడుతున్నారని ఆరోపించారు. జగన్ కు అధికారమిచ్చింది నిందితులను కాపాడటానికేనా..? ఒకప్పుడు అన్న కోసం పాదయాత్ర చేశా.. ఇప్పుడు న్యాయం కోసం నిలబడ్డానన్నారు. న్యాయం గెలుస్తుందా..? నేరం గెలుస్తుందా..? అని ప్రపంచమంతా చూస్తోందని, కడప ప్రజలు న్యాయాన్ని గెలిపించాలని ఆమె కోరారు.
అనంతరం సునీత మాట్లాడుతూ న్యాయం కోసం పోరాడుతున్నామని చెప్పారు. ఈ పోరాటంలో కోర్టు తీర్పు చాలా ఆలస్యం కావచ్చన్నారు. ప్రజా తీర్పు పెద్దదని.. దాని కోసం షర్మిల ఎంపీగా పోటీ చేస్తున్నారని చెప్పారు. షర్మిలను గెలిపించి వివేకా ఆత్మకు శాంతి కలిగించాలని ఆమె కోరారు.