Revanth : రేవంత్ ఆదేశాలతో పోలీసుల ఉరుకులు పరుగులు

Revanth

Revanth

CM Revanth : అర్థరాత్రి కాదు కదా.. పట్టపగలు, అదీ జన సంచారం ఉన్న సమయంలో కూడా నగరంలో రోడ్ల మీద ఒంటరిగా వెళ్లాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. అందుకు దొంగతనాలు, చైన్‌ స్నాచింగ్‌ లే కారణం. మెడలో ఏమాత్రం బంగారం ఉన్నా బయటకు వెళ్లాలంటే.. చైన్‌ స్నాచర్స్‌ గురించి ఆలోచించి భయపడాల్సి వస్తోంది. హైదరాబాద్‌ రోడ్ల మీద ఒంటరిగా తిరిగే వారిని ఉద్దేశించి పోలీసులు అలర్ట్‌ జారీ చేశారు. జాగ్రత్తగా ఉండకపోతే డేంజర్‌లో పడ్డట్లే అంటున్నారు. ఈజీమనీ, చెడు వ్యసనాలకు అలవాటుపడిన వారు.. చైన్‌ స్నాచింగ్‌, దొంగతనాలకు పాల్పడుతూ.. జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.

ఈమధ్యకాలంలో నగరంలో సెల్‌ఫోన్‌ దొంగతనాలు, చైన్‌ స్నాచింగ్‌లు ఎక్కువయ్యాయి. ఇలాంటి నేరాలకు పాల్పడే వారు.. రోడ్ల మీద ఒంటరిగా వెళ్లే వారిని టార్గెట్‌ చేసుకుని.. చైన్‌ స్నాచింగ్‌, మొబైల్‌ దొంగతనాలకు పాల్పడుతున్నారు. సమాజానికి కీచకులుగా మారిన వారిని అరికట్టడానికి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. అలాంటి వారి పట్ల ఏ మాత్రం ఉపేక్షించవద్దని పోలీసులకు ఆదేశాలు జారీచేసింది.

శివారుల్లో ఒంటరిగా వెళ్లే మహిళలను స్నాచర్లు వదలడం లేదు. వారిని వేటాడి వెంటాడి మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులు లాక్కొని పారిపోతున్నారు. ఇటీవల రాచకొండలోని పలు పోలీస్‌స్టేషన్ల పరిధిలో వరుస స్నాచింగ్‌లు జరిగాయి. చైన్‌ స్నాచింగ్‌లు, సెల్‌ఫోన్‌ స్నాచింగ్‌లతో హడలెత్తిస్తున్న నేరగాళ్లను కట్టడి చేయాల్సిన పోలీసులు.. ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

పెట్రోలింగ్‌ వ్యవస్థలోని లోపాలే స్నాచర్లకు కలిసి వస్తున్నట్టు ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి వారిని అణచివేసేందుకు పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. నగరంలో యాంటీ స్నాచింగ్‌ టీమ్‌లు, యాంటి డెకాయిట్ స్కాడ్లు ఏర్పాటు చేశారు. వాటితో పోలీసులు ఆశించిన ఫలితాలు రాబట్టుతున్నారు. నగరంలో విజుబుల్‌ పోలీసింగ్‌తో కూడిన పెట్రోలింగ్‌ ఏర్పాటు చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

TAGS