Eggs price : నిన్నటి దాక కోడిగుడ్డు ధరలు ఆకాశాన్నంటాయి. కోడిగుడ్ల కంటే చికెన్ తిన్నది మేలని జనాలు చికెన్ వంటలే చేసుకున్నారు. ఇక సంక్రాంతి పండగ వేళ.. కోడి గుడ్ల ధరలు కొద్దిగా తగ్గి వినియోగదారులకు కాస్త ఉపశమనం ఇచ్చాయి.
గత రెండు నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్డు ధరలు కొండెక్కాయి. అయితే చికెన్ ధరలు మాత్రం ఓ సారి తగ్గడం. మరోసారి పెరగడం జరిగింది. కానీ కోడి గుడ్డు ధరలు మాత్రం పెరుగుకుంటూ వచ్చాయి. ఇలా రోజురోజుకూ కోడి గుడ్డు సగటు జనాలకు భారమైపోయింది. వారం రోజుల్లోనే డజన్ ఎగ్స్ ధర ఏకంగా రూ.84 కు చేరింది. దీంతో ఒక్క గుడ్డు ధర రూ.7 పలికింది.
కోడిగుడ్డు ధరలు ఇలా పెరగడానికి కారణమేంటని వాకబు చేస్తే.. కోళ్లకు పెట్టే దాణా రేట్లు భారీగా పెరిగాయని నిర్వాహకులు చెబుతున్నారు. గతంలో దాణా రేటు కిలోకు రూ.17వరకు ఉండేది. ప్రస్తుతం అది రూ.28కి చేరుకుంది. డిమాండ్ కు తగ్గట్టు గుడ్ల ఉత్పత్తి లేకపోవడంతో కోడి గుడ్ల ధరలు పెంచకతప్పడం లేదని వారు చెబుతున్నారు. దీంతో పాటు రవాణా భారం కూడా భారీగా పెరిగిందని అంటున్నారు. ఇలా పలు కారణాల వల్ల ఎగ్స్ ధర పెరుగుతోందని చెబుతున్నారు.
రోజుకు 15-20 లక్షల అమ్మకాలు జరుగుతున్నాయని, డిమాండ్ ఇలాగే ఉంటే ఎగ్స్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇవాళ మాత్రం కోడిగుడ్ల ధరలు అనూహ్యంగా తగ్గి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ఏపీలో ఒక్కో కోడిగుడ్డు ధర రూ.5.80 పైసలు ఉండగా డజన్ రూ.69పలుకుతోంది. తెలంగాణలో హైదరాబాద్ లో హోల్ సేల్ లో ఒక్కో కోడిగుడ్డు ధర రూ.5.50 పైసలు పలుకుతోంది. డజన్ ఎగ్స్ రూ.66కు అమ్ముతున్నారు. సంక్రాంతి వేళ కోడిగుడ్డు ధర తగ్గడం వినియోగదారులకు కాస్త ఊరటనిచ్చినట్టైంది.