Deputy CM Pawan : ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ విజయవాడలోని క్యాంపు ఆఫీసులో బుధవారం ఉదయం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖలు నిర్వర్తిస్తారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన శాఖాపరమైన సమీక్షలు మొదలు పెట్టారు. తొలి రోజే శాఖలపై లోతుగా సమీక్ష నిర్వహించారు. సుమారు 10 గంటలపాటు సంబంధిత శాఖలపై సమీక్ష చేపట్టారు. ప్రతి అంశాన్నీ కూలంకషంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు.
తొలుత పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు సంబంధించిన పథకాలు, వాటి పురోగతి, శాఖాపరమైన కార్యకలాపాలను ఉన్నతాధికారులు పవన్ కళ్యాణ్ కు వివరించారు. సుమారు మూడు గంటలపాటు సాగిన ఈ సమీక్షలో శాఖలకు సంబంధించిన ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. ఈ శాఖల ద్వారా గ్రామస్థాయిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పని చేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఉద్యాన వన సంబంధిత పనులకు నిధులను పెంపుదల కూడా అటు రైతులు, ఇటు ఉపాధి హామీ కూలీలకు భరోసా కల్పించడంలో భాగమని తెలిపారు. గురువారం ఈ శాఖలకు సంబంధించిన సోషల్ ఆడిట్, ఇంజినీరింగ్, గ్రామీణ నీటి సరఫరా విభాగాల అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్షిస్తారు. గ్రామాల్లోని రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టారు. గ్రామాల్లో మౌలిక వసతులు, మంచినీటి కొరత రాకుండా చూడాలని అధికారులకు దిశా నిర్దేశనం చేశారు. తాను చెప్పిన అంశాలపై వెంటనే యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలంటూ అధికారులను ఆదేశించారు. మూడు నెలల్లో ఈ సమస్యల పరిష్కారం జరగాలని టార్గెట్ ఫిక్స్ చేశారు.
బుధవారం సాయంత్రం అటవీ శాఖపై సమీక్ష చేపట్టారు. ఈ శాఖ కార్యకలాపాలను, అటవీ పరిరక్షణ అంశాలు, కాలుష్య నియంత్రణ, పర్యావరణ సంబంధిత విషయాలపై ఉన్నతాధికారులతో కూలంకుషంగా చర్చించారు. సామాజిక వనాలు, నగర వనాలు పెంపు, జీవ వైవిధ్య మండలి కార్యకలాపాలను అడిగి తెలుసుకున్నారు. మడ అడవుల పరిరక్షణ, వాటిని పెంచడంపై చర్చించారు. పచ్చదనం పెంచడం, అటవీ సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఆ తర్వాత పవన్ తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ సమావేశమయ్యారు. ఉదయం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ పవన్ కల్యాణ్ సంతకం చేశారు. గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణం దస్త్రంపై రెండో సంతకం చేశారు.