Atchannaidu : ఏపీలో టీడీపీ కూటమి అఖండ విజయం సాధించింది. ఈ రోజు ఉదయం 11:27 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మంత్రి వర్గ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే టీడీపీ కూటమి మిత్రపక్ష పార్టీలకు మంత్రి పదవుల పంపకం కూడా పూర్తయింది. మొత్తం 25 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అందులో టీడీపీ నుంచి 20 మంది, జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 1 సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరిలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు కూడా ఉన్నారు.
అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు సరిగ్గా ఇదే రోజు అంటే 2020 జూన్ 12 శనివారం ఉదయం అరెస్ట్ చేశారు. విజయవాడ నుంచి బస్సుల్లో శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో పోలీసులు, ఏసీబీ అధికారులు తెల్లవారుజామున ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 7.20 గంటలకు అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ఈఎస్ఐలో రూ.150 కోట్ల మేర నిధులు దుర్వినియోగం అయ్యాయని విజిలెన్స్ విచారణలో తేలడంతో ఏసీబీ ఆయనను అరెస్ట్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పలు నగరాల్లో ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
నకిలీ బిల్లులు, ఇన్‌వాయిస్‌లతో నిధులు కాజేశారని, ఈ టెండర్ విధానాన్ని పాటించలేదని వీరి పై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో అచ్చెన్నాయుడు పాత్ర కీలకమని ఏసీబీ ఆరోపించింది. ప్రభుత్వం తరపున ఉత్తర్వులు ఇవ్వాల్సిన ఉన్నతాధికారులకు తెలియకుండానే నిధులను కాజేశారని అప్పట్లో ఏసీబీ అధికారులు తెలిపారు. 2020లో అచ్చెన్నాయుడు కార్మిక శాఖ మంత్రి పని చేశారు. ఆ సమయంలోనే ఈఎస్ఐ మందులు, పరికరాల కొనుగోళ్లలు అక్రమాలు జరిగాయని విజిలెన్స్ విభాగం తెలిపింది. సరిగ్గా నాలుగేళ్ల తర్వాత అచ్చెన్నాయుడు మరో సారి చంద్రబాబు నేతృత్వంలో మంత్రిగా ప్రమాణం చేయనున్నారు.