YSR Jayanthi : అయ్యో రాజన్న నిన్ను జగన్ కూడా వదిలేశారే
YSR Jayanthi : వైఎస్సార్ ఈ పేరే ఓ వైబ్రేషన్. తెలుగు ప్రజలు మరిచిపోలేని పేరు. జనం గుండెల్లో ఆయనది చెదరని ముద్ర. రాజన్న పేరులోనే కాదు.. మ్యానరిజంలోనూ రాజసం. మడమతిప్పని గుణం.. ఎవరికైనా ఎదురెళ్లే మొండి ధైర్యం. సాయం కోరి వచ్చిన వారికి అండగా నిలిచే తత్వం. జనంలోంచి వచ్చిన మాస్ లీడర్. శత్రువును సైతం ఆప్యాయంగా పలకరించే అరుదైన నేత. ప్రజలకు దూరమై 15 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఆయన రూపం కళ్లముందు కదలాడుతూనే ఉంటుంది. నేడు వైఎస్ జయంతి.. ఈ రోజు అంటే వైసీపీకి మమూలుగా పండగ కాదు. తన కుమారుడు జగన్‌కు కూడా. గత ఐదేళ్లలో వైఎస్ జయంతి రోజు ప్రజల డబ్బు కనీసం వంద కోట్లు మంచినీళ్లలా ఖర్చు అయిపోయేవి. అంతేనా ఆ పార్టీ నేతలకూ చేతి చమురు వదిలేది. సాక్షి పత్రికకు పండగే. మంత్రుల దగ్గర నుంచి మైనింగ్ వ్యాపారుల వరకూ అందరూ తమ స్థాయిలో తాము ఎంతో కొంత ప్రకటనల రూపంలో సాక్షికి ముట్టజెప్పేవారు. అయితే ఇప్పుడు సీన్ రీవర్స్ అయింది. వైఎస్ఆర్ ను పట్టించుకునేవారే వైసీపీలో లేరు. చివరికి జగన్ కూడా.
ఇడుపులపాయలో పొద్దున్నే వెళ్లి ఓ నమస్కారం చేసి వచ్చేస్తారు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత పార్టీ నేతలు ఎవరైనా వైఎస్ జయంతి పేరుతో పూలు, పండ్లు పంచితే ఆ ఫోటోలు సాక్షి మీడియాలో పబ్లిష్ చేస్తారు. అంతే తప్ప పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమం చేపట్టడం లేదు. వైఎస్ ను ఒక్క సారిగా ఎందుకు తమ పార్టీకి చెందిన నేతగా వైసీపీ భావించడం లేదో ఆ పార్టీ క్యాడర్ కు అర్థం కావడం లేదు. వైఎస్ ను గౌరవించే పేరుతో లేనిపోని గొడవలను ఆయన మెడకు చుట్టి.. ఎక్కడైనా విగ్రహాలు కనిపించినా ఇక్కడెందుకు తీసేయాలి కదా అని ప్రతి ఒక్క మనసులో అనిపించేలా పాలన చేశారు జగన్మోహన్ రెడ్డి.
వైఎస్‌ను జగన్ కన్నా షర్మిలనే ఎక్కువ అగ్రెసివ్‌గా ఉపయోగించుకుంటున్నారు. ఆంధ్రజ్యోతిలో ఫుల్ పేజీ యాడ్లు ఇచ్చారు. కానీ సొంత పత్రిక సాక్షిలో మాత్రం చిన్న సైజ్ యాడ్ కూడా లేదు. ఒక్క షర్మిల కాదు. ఏ ఒక్క వైసీపీ నేత ఇవ్వలేదు. ఐదేళ్లు అధికారంలో ఉండి సంపాదించుకున్న వారు సైలెంట్ అయిపోయారు. జగనే అలా ఉంటే తమకు మాత్రం ఎందుకనేది వారి భావన. జగన్ వ్యూహాత్మక తప్పిదం చేస్తున్నారో… లేక షర్మిల ప్లాన్డ్ గా ముందుకు వెళ్తున్నారో కానీ ఇప్పుడు మెల్లగా వైఎస్.. కాంగ్రెస్ పార్టీ ఆస్తిగా మారుతున్నారు.