Dharmapuri Arvind : బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ బీజేపీ నుంచి అధికార పార్టీని కార్నర్ చేయడంలో ముందున్నది నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. తండ్రి వారసత్వంతో అడుగిడిన అర్వింద్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. తండ్రి ధర్మపురి శ్రీనివాస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రి పని చేశారు. అప్పుడు తండ్రి వెనకుండి వ్యూహాలు రచించాడు. కానీ అర్వింద్ మాత్రం అనూహ్యంగా బీజేపీలో చేరి నిజామాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేశాడు. అప్పటికే ఎంపీగా ఉన్న కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితను ఓడించి బీజేపీ జాతీయ నేతల దృష్టిని ఆకర్షించాడు.
టార్గెట్ కేసీఆర్ ఫ్యామిలీ
రాష్ర్టంలో మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను కార్నర్ చేయడంలో అర్వింద్ ను మించిన వారు లేరు. కేసీఆర్ ప్రత్యర్థి పార్టీలను ఎలా చులకన చేసి మాట్లాడే వారో అర్వింద్ సైతం కేసీఆర్ ఫ్యామిలీని అదే తరహాలో చులకన చేసేవారు. ఒక దశలో రాష్ర్టంలో బీఆర్ఎస్ వర్సెస్ అర్వింద్ అనే స్థాయిలో యుద్ధం సాగింది. ఎంపీ ఎన్నికల్లో కవితను ఓడించి మరోసారి నిజామాబాద్ లో పోటీ చేయడానికి కూడా వెనకడుగు వేసేలా చేశాడు. అదీ అర్వింద్ సామర్థ్యం.
మంత్రి పదవి వస్తుందని..
ఈసారి తాను గెలిస్తే బీజేపీ అధిష్టానం తనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తుందని ఆశలు పెట్టుకున్నాడు. ఎన్నికల క్యాంపెయిన్ సమయంలో నేరుగా కాకున్నా అంతర్గతంగా అలాగే ప్రచారం చేసుకున్నారు. మొత్తానికి ఎంపీగా గెలిచాడు. కానీ అదే సయయంలో రాష్ర్టంలో బీజేపీ 4 స్థానాల నుంచి 8 స్థానాలను గెలుచుకోవడంతో పాటు ఏపీలోనూ మూడు సీట్లు గెలుచుకోవడంతో మంత్రి పదవుల కేటాయింపు అధిష్టానికి కత్తి మీద సాములా మారింది. అటు సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డి, పార్టీని కొత్త పుంతలు తొక్కించిన బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నుంచి వచ్చిన డీకే అరుణ లాంటి సమీకరణాల నేపథ్యంలో అర్వింద్ కు మంత్రి పదవి రాలేదని తెలుస్తున్నది. అదే సమయంలో బండి సంజయ్, అర్వింద్ సామాజికవర్గాలు కూడా ఒకటే కావడం కూడా కొంత కారణంగా మారింది. అయితే భవిష్యత్ లో అర్వింద్ కు మంచి స్థానం దక్కుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు.