Odisha Leader : కేసీఆర్..ఈ మూడు అక్షరాల పేరు చాలు ‘సీఎం’ అనే పదానికి కన్నా ఎంతో పవర్ ఫుల్ అని బీఆర్ఎస్ నేతలు అంటుంటారు. తాజాగా ఆయనకే షాక్ ఇచ్చారు ఓ రాష్ట్ర ప్రధాన నేత. గత పదేండ్లుగా తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్.. దేశ వ్యాప్తంగా కీలక నేతగా పేరు సంపాదించారు. తెలంగాణకే పరిమితమైన టీఆర్ఎస్ ను దేశ రాజకీయాల్లో బీజేపీకి దీటుగా చేస్తానని చెప్పి బీఆర్ఎస్ గా మార్చారు. జాతీయ పార్టీగా కర్నాటక, మహారాష్ట్ర, ఏపీ, ఒడిశాలోనూ పార్టీ శాఖలు ఏర్పాటు చేశారు. అక్కడి నేతలను పార్టీలో చేర్చుకున్నారు. కర్నాటక కుమారస్వామి బీజేపీకి మద్దతు ఇవ్వడంతో పాటు కేసీఆర్ తో దోస్తీకి కటీఫ్ చెప్పారు. ఇక మహారాష్ట్రలో బీఆర్ఎస్ లో అరకొర నేతలే ఉన్నారు.
తాజాగా ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గొమాంగో, ఆయన కుటుంబం బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతోంది. ఆయనతో పాటు ఆయన సతీమణి, కొరాపుట్ లోక్ సభ మాజీ ఎంపీ హేమా గొమాంగో, తనయుడు శిశిర్ కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు. ఈమేరకు ఆయన ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో గత శనివారం ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల పరిశీలకులు డాక్టర్ అజయ్ కుమార్ తో భేటి అయ్యారు. రాష్ట్రంలో బీజేడీ అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిధర్ భవిష్యత్ ప్రశ్నార్థకంలో పడింది. ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఆ తర్వాత ఆ మధ్య బీఆర్ఎస్ లో చేరారు.
గిరిధర్ సొంత పార్టీ కాంగ్రెస్ నుంచి 1972లో కొరాపుట్ ఎంపీగా గెలుపొందారు. తర్వాత వరుసగా 2004 దాక గెలుచుకుంటూ వచ్చారు. ఓసారి ఒడిశా ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఇక బీజేడీ అధికారంలోకి వచ్చాక..గిరిధర్ రాజకీయాల నుంచి దాదాపు బయటకు వచ్చినంత పనిచేశారు.
ఇక గతేడాది కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ ఎస్ లో చేరారు. ఒడిశాలో గులాబీ పార్టీని అధికారంలోకి తీసుకొస్తానని చేరిక సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. లోక్ సభ ఎన్నికల్లోనూ సత్తా చాటుతామని చెప్పారు. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడంతో బీఆర్ఎస్ నుంచి బయటి రాష్ట్రాల నేతలందరూ కేసీఆర్ కు హ్యాండ్ ఇస్తున్నారు. బీఆర్ఎస్ లో ఉంటే లాభం లేదనుకున్నా గొమాంగో సొంత పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక బీఆర్ఎస్ కు ఒడిశాలో ప్రతినిధి ఎవరూ లేకుండా అయినట్టేనని చెప్పాలి. ఇక తెలంగాణ నేతలు మాత్రం బీఆర్ఎస్ వద్దు.. టీఆర్ఎస్సై ముద్దు..అని మళ్లీ పాత పేరే కావాలంటున్నారు. దేశం వద్దు..తెలంగాణే ముద్దు అంటూ పార్టీ సమీక్షల్లో నినదిస్తున్నారు.