Ex CM Jagan : మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందులలో పర్యటించారు. శనివారం సొంత నియోజకవర్గానికి వెళ్లిన ఆయన సోమవారం సైతం ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనను కలుస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ జనాలకు జగన్ అందుబాటులో ఉన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వినతులను స్వీకరిస్తున్నారు. పులివెందులలో జగన్ గొప్ప కార్యక్రమం చేపడుతున్నాడని నీలి మీడియా ప్రచారం చేసింది. అసలు ఇప్పుడు ప్రజాదర్బార్ ఎలా చేస్తారు.. ప్రజల సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారు. ఒక వేళ పరిష్కరించమని అక్కడికక్కడ ఏ అధికారుల్ని ఆదేశిస్తారు.. ఒక వేళ ఆదేశాలు జారీ చేసినా ఆయన మాట వినే వాళ్లు ఎక్కడ ఉన్నారు. ఆకలేస్తుంది బాబు ఓ ముద్ద తిండి పెట్టమంటే.. మన ప్రభుత్వం రానీవ్వండి కడుపు నిండా పెడతాననే మనస్తత్వం ఆయనది. ఇంక ప్రజా దర్బార్ నిర్వహించి ఏం చేస్తారు.
ఆయన ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఒక్క సారి కూడా ప్రజాదర్బార్ నిర్వహించలేదు. ఓడిపోయాక పది రోజుల్లోనే వచ్చి ప్రజాదర్బార్ పేరుతో కొత్త నాటకానికి తెరలేపారు. తమ సమస్యలను తీర్చుతాడని ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే వారిని పట్టించుకోకుండా ఐదేళ్ల పాటు వర్క్ ఫ్రం ప్యాలెస్ చేస్తూ వచ్చారు. ఎప్పుడైనా ప్రజల్ని కలుద్దామన్న కనీస ఆలోచన కూడా చేయలేదు. ప్రజల్ని పురుగుల కంటే హీనంగా చూశారు. ఓట్లు పొందడానికి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలను అడగడానికి జనం వస్తారేమో అని ప్యాలెస్ చుట్టూ 144 సెక్షన్, 30 అడుగుల ఎత్తున ఇంటి చుట్టూ ఇనుప కచ్చడాలు బిగించుకుని అందులోనే కూర్చున్నారు.
పులివెందులలో నిర్వహించిన ప్రజాదర్బార్ కు వచ్చిన వారిలో చాలామంది సమస్యలతోనే వచ్చారు. తమకు బిల్లులు ఇవ్వాలని … ఇప్పుడెవరు దిక్కని ఆవేదన చెందే వారే ఎక్కువ. వారందరికీ కోర్టుకెళదామని చెప్పి పంపారు జగన్. బడా బడా కాంట్రాక్టర్లకు వేల కోట్లు చెల్లించారు. కానీ కింది స్థాయి క్యాడర్ కు కనీస బిల్లులు చెల్లించలేదని దీనిని బట్టి స్పష్టమవుతుంది. జగన్ చేసిన అడ్డగోలు తప్పిదాల్లో ఇవి ఒకటి. ఎన్నికల్లో ఓడిపోగానే పులివెందులకు వచ్చి ప్రజాదర్బార్ పేరుతో హడావుడి చేస్తే.. ఏమీ ప్రయోజనం ఉండదని రాజకీయ విశ్లేషకులు హితవు పలుకుతున్నారు.