BJP : ప్రస్తుతం తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం రాజకీయ వర్గాల్లో కాక రేపుతోంది. ఇప్పటివరకు బీఆర్ఎస్ నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేయడంతోపాటు బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. బీఆర్ఎస్ ను వెనక్కి నెట్టి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కు కకావికలం అవుతోన్న బీఆర్ఎస్.. బీజేపీ ప్లాన్ తో మరింత ఉక్కిరిబిక్కిరి కాబోతోందన్న వాదన బలంగా వినిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాల లోపు కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం ఖాయమని కమలం పార్టీ అంచనా వేస్తోంది.
అదే సమయంలో కాంగ్రెస్ లోకి వెళ్లలేని కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారని, పార్టీలో చేరాలనుకుంటే పదవులకు రాజీనామా చేయాలనే కండిషన్ పెట్టడంతో వారంతా బీజేపీలో చేరికపై ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని బండి సంజయ్ కూడా వెల్లడించారు. ఆదివారం కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 26 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని సంచలన వాఖ్యలు చేశారు.
అయితే, కాంగ్రెస్ లో చేరేందుకు సుముఖంగా లేని ఓ నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్న చర్చ నడుస్తోంది. పార్టీ నిర్ణయం మేరకు ప్రస్తుతం పదవులకు రాజీనామా చేయలేమని పార్టీ పెద్దలకు ఆ నలుగురు చెప్పినట్లు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఎలాగూ.. బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోతుందని, ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు తమ చేరికలు ఉపయోగపడుతాయని ఆ ఎమ్మెల్యేలు సూచించినట్లుగా సమాచారం. నేడో, రేపో మరో నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని.. మరో నలుగురు బీజేపీ కండువా కప్పుకుంటారన్న ప్రచారం బీఆర్ఎస్ అధిష్టానాన్ని మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇరువైపుల నుంచి బీఆర్ఎస్ టార్గెట్ గా దాడి కొనసాగుతుండటంతో బీఆర్ఎస్ అగ్రనేతలు కకావికలం అవుతున్నారు.