MLA Chirumurthy Lingaiah : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఈ కేసులో.. తాజాగా పోలీసులు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు జారీ చేశారు. ఈరోజు (సోమవారం) జూబ్లీహిల్స్ లోని పోలీస్ స్టేషన్ కు రావాలంటూ నోటీసులు ఇచ్చారు. ఈ కే సులో నిందితుడిగా ఉన్న తిరుపతన్నతో చిరుమర్తి లింగయ్య ఫోన్ కాంటాక్ట్స్ జరిపినట్లు తేలడంతో పోలీసులు నోటీసులు జారీచేశారు. మొదటిసారిగా ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ నాయకుడికి నోటీసులు జారీ కావడంతో ఉత్కంఠ నెలకొంది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు అరెస్టు కాగా, రాజకీయ నాయకులు కూడా అరెస్టు అవుతారంటూ కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తికి నోటీసులు జారీ అయ్యాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చిరుమర్తి లింగయ్య ప్రమేయం ఉన్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. తన ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్ చేసి నిఘా ఉంచినట్లు నిర్ధారించి నోటీసులు జారీ చేశారు.