TSPSC – TGPSC : ఇక నుంచి టీఎస్‌పీఎస్సీ కాదు.. టీజీపీఎస్సీ: గ్రూప్ 1 ప్రిలిమ్స్ 9న, 1 నుంచి హాల్ టికెట్లు
TSPSC – TGPSC : టీజీపీఎస్సీ(TGPSC) గ్రూప్ -1 ప్రిలిమ్స్ పై కీలక అప్డేట్ వచ్చింది. జూన్ 1న మధ్యాహ్నం 2 గంటల తర్వాత నుంచి గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్ టికెట్లు అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయని టీజీపీఎస్సీ ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం అధికారిక వెబ్ సైట్లో టీఎస్ స్థానంలో టీజీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)ని టీజీపీఎస్సీ(TGPSC)గా మారుస్తూ సీఎస్ శాంతికుమారి మే 29వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌గా పిలవబడిన టీఎస్‌పీఎస్సీ.. ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌గా పిలుస్తారు. జూన్ 9వ తేదీ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు.
తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు సర్వం సిద్ధమవుతోంది. జూన్ 9న నిర్వహించనున్న ప్రిలిమ్స్ పరీక్ష కోసం టీజీపీఎస్సీ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. గతంలో పేపర్ల లీకేజీ నేపథ్యంలో ఏ చిన్న తప్పుకు అవకాశం ఇవ్వొద్దని రేవంత్ సర్కార్ భావిస్తోంది. తెలంగాణలో మొత్తం 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేసి మరికొన్ని పోస్టులను కలిపి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో భాగంగా జూన్ 9న ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించనున్నారు.
జూన్ 1న మధ్యాహ్నం 2 గంటల నుంచి టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. జూన్ 9న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇక, ఈ పరీక్షకు 30 నిమిషాల ముందే అంటే ఉదయం 10 గంటలకే ఎగ్జామినేషన్ సెంటర్ల వద్ద ఉన్న గేట్లు మూసివేస్తారని అధికారులు తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి ప్రతి పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలెటర్లు అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకుంటారు. ఆబ్జెక్టివ్ టైప్ ఓఎంఆర్ విధానంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. నమూనా ఓఎంఆర్ షీట్‌ను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ పరీక్షలను నిర్వహించనుంది.