DK Aruna : కేంద్రమంత్రి పదవి కోసం లాబీయింగ్ చేయడం లేదని, పార్టీ ఏ బాధ్యత అప్పగించినా పనిచేస్తానని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఆమె విలేకరులతో మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పాలనకు రెఫరెండమని చెప్పారు. 14 స్థానాల్లో విజయం సాధిస్తామన్నారు, ఇప్పుడేమైందని ప్రశ్నించారు. ప్రధాని మోదీ రాజీనామా చేసి తప్పుకోవడం కాదని, మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలైనందుకు సీఎం పదవి నుంచి రేవంత్ వైదొలగాలన్నారు.
బీఆర్ఎస్ ఆత్మబలిదానం చేసుకుని బీజేపీని గెలిపించిందని రేవంత్ తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. మహబూబ్ నగర్ లో ఓడిపోతే అభివృద్ధి జరగదని చెప్పారని, అక్కడ ఆయనే అభ్యర్థిలా వ్యవహరించారని తెలిపారు. కొందరు నేతలు కర్ణాటక నుంచి వచ్చి ఎన్నికల్లో డబ్బులు పంచారు. రాష్ట్రంలో బీజేపీకి 10 సీట్లు వస్తాయని అంచనా వేశాం, కానీ 8 సీట్లకు పరిమితమయ్యామని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కేంద్రంతో ఇక్కడి ప్రభుత్వం స్నేహపూర్వకంగా వ్యవహరించాలని డీకే అరుణ సూచించారు.