Yash Fan Tragedy : హీరోలు కాదు.. కుటుంబమే ఫస్ట్.. ఏడ్చేసిన రాఖీభాయ్..

Yash Fan Tragedy

Yash Fans died in karnataka

Yash Fan Tragedy : కేజీఎఫ్ మూవీతో ఓవర్ నైట్ పాన్ ఇండియన్ స్టార్ అయిపోయారు యశ్. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన యశ్.. టీవీ నటుడిగా, ఆ తర్వాత చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ వచ్చారు. డిఫరెంట్ లుక్ లో స్టైలిష్ గా ఉండే యశ్.. ప్రశాంత్ నీల్ కంట్లో పడి.. కేజీఎఫ్ ద్వారా రాఖీభాయ్ గా మారిపోయాడు. కేజీఎఫ్ 1,2లు పాన్ ఇండియా లెవల్లో రికార్డుల మోత మోగించాయి. ఈ మూవీ ద్వారా యశ్ గ్రాఫ్ అమాంతం ఎవరెస్ట్ ఎక్కేసిందనే చెప్పాలి. లక్షలాది డైహర్డ్ ఫ్యాన్స్ ను ఆయన సొంతం చేసుకున్నారు.

నిన్న యశ్ పుట్టిన రోజు వేడుకలను కర్నాటకలో పెద్ద ఎత్తున అభిమానులు నిర్వహించుకున్నారు.  పుట్టినరోజు వేడుకలకు ఏర్పాట్లు చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి ముగ్గురు అభిమానులు దుర్మరణం చెందారు. కర్నాటకలోని గడగ్ జిల్లాలోని సురంగి  గ్రామంలో యశ్ అభిమానులైన ముగ్గురు  యువకులు నిన్న యశ్ పుట్టిన రోజు సందర్భంగా బ్యానర్లు కడుతుండగా పక్కనే ఉన్న పవర్ లైన్ నుంచి హైవోల్టేజీ షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందారు. దీంతో ఆ యువకుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మృతిచెందినవారిలో  హనుమంత్(24), మురళి(20), నవీన్(20) ఉన్నారు.

ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది. ఈ వార్త విన్న వెంటనే యశ్.. సాయంత్రం ఆ గ్రామానికి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించారు. యశ్ అక్కడికి రావడంతో బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరయ్యాయి. వారిని ఓదార్చిన అనంతరం యశ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నాకు ఇంత మంది ఫ్యాన్స్ ఉండడం అదృష్టంగా భావిస్తున్నా.. నేనెప్పుడూ వారిని నాకోసం బ్యానర్లు కట్టి హంగామా చేయమని చెప్పను. ప్రతీ సంవత్సరం నా పుట్టిన రోజుకు మీరు చేసే ఇలాంటి పనుల వల్ల మీకేదైనా జరుగుతుందేమోనని భయపడుతున్నాను. ఎవరికైనా కుటుంబమే ఫస్ట్. కుటుంబం కోసమే బతకాలి. నేను కరోనా సమయం దగ్గర నుంచి నేను బర్త్ డేలు జరుపుకోవడం లేదు. దానివల్ల మీలాంటి వారికి నష్టం జరుగుతోంది. డబ్బులు ఎవరైనా సాయం చేస్తారు. కానీ పోయిన కొడుకు మళ్లీ తిరిగిరాడు’’ అని ఎమోషనల్ అయ్యారు.

కాగా, యశ్ పరామర్శకు వస్తున్నప్పుడు ఆయన కారును పలువురు అభిమానులు బైక్ పై ఫాలో అవుతూ స్పీడ్ గా వచ్చారు. వారిలో ఓ అభిమానికి యాక్సిడెంట్ కాగా హాస్పిటల్ లో చేర్పించారు. అతన్ని కూడా యశ్ వెళ్లి పరామర్శించి..దయచేసి అభిమానులు ఎవరూ అలా చేయకండి అని కోరారు.

TAGS