Ashwinidat : ప్రస్తుతం దేశవిదేశాల్లో కల్కి 2898 ఏడీ సినిమా వసూళ్ల పరంగా దుమ్ము దులుపుతున్న విషయం
తెలిసిందే. దీంతో నిర్మాతగా అశ్వినీదత్ కు తన 50 ఏళ్ల ప్రస్థానంలో ఈ సినిమా ఇచ్చిన ఆనందం అంతా ఇంతా కాదు. వైజయంతి మూవీస్ సంస్థ ప్రారంభమై ఈ ఏడాదికి 50 ఏళ్లు. చరిత్రలో చెప్పుకునే బ్లాక్ బస్టర్ అందుకున్న ఆనందం నిర్మాత అశ్వినీదత్ లో స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ క్రమంలో తమ సంస్థ ప్రయాణాన్ని ఓ ఇంటర్వ్యూ రూపంలో పంచుకున్నారు నిర్మాత ఆశ్వినీదత్. ఇందులో కల్కికి సంబంధించిన విశేషాలతో పాటు తన ప్రయాణంలో ఎదుర్కొన్న అనుభవాలు, విజయాలు, అపజయాలు, తాను అందుకున్న మైలురాళ్ల గురించి వెల్లడించారు. వాటిలో ఒకటి 1996లో విడదలైన పెళ్లి సందడి సినిమా.
రూ. 1. 20 కోట్లతో తీసిన ఈ సినిమా ఫుల్ రన్ లో రూ. 11 .30 కోట్లు వసూలు చేసి అప్పట్లో రికార్డు క్రియేట్ చేసింది. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లు అశ్వినీదత్, అల్లు అరవింద్ కలిసి ఒక చిన్న సినిమా చేయడం విశేషం. వీరిద్దరూ కలిసి ఓ చిన్న సినిమా చేద్దామని ఫిక్సయ్యారు. దీంతో డైరెక్టర్ రాఘవేంద్రరావును సంప్రదించారట. అప్పుడే పెళ్లి సందడి సినిమా కథ సిద్ధమై ఉండడంతో దర్శకేంద్రుడు అదే కథను వారికి చెప్పాడట. బడ్జెట్ తక్కువగా ఉండడంతో సినిమా చకాచకా పూర్తయ్యింది. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఇచ్చిన ఆణిముత్యాల్లాంటి పాటలు ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని ఉర్రూతలూగించాయి. చిన్న సెంటర్లలోనూ ఈ సినిమా సిల్వర్ జూబ్లీ ఆడింది.
పెళ్లి సందడి రిలీజ్ టైమ్ లో హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాల్లోనూ టికెట్ ధరలు రూ. 5 నుంచి రూ. 30 మాత్రమే ఉండేవి. ఆ రేట్లతోనే ఈ సినిమా రూ. 11 కోట్లకు పైగా వసూలు చేయడం ఒక సంచలనం. ఇప్పటి రేట్లతో అప్పటి కలెక్షన్లను లెక్కేసుకుంటే వందల కోట్లు దాటుతుంది. తాము చేసిన చిన్న ప్రయత్నం గొప్ప ఫలితాన్ని ఇవ్వడం ఆనందంగానే ఉన్న అశ్వినిదత్, అల్లు అరవింద్ కి కొంత షాకింగ్ గా అనిపించింది. సంక్రాంతి బరిలో నిల్చున్న ఈ సినిమా పోటీని తట్టుకుని మరీ అనూహ్య విజయం సాధించింది. కంటెంట్ ఈజ్ కింగ్ అనే మాట ఇప్పుడు అంటున్నాం.. కానీ ఆ సత్యం ఎప్పుడో 30 ఏళ్ల క్రితమే రుజువైందన్నారీ సీనియర్ ప్రొడ్యూసర్.